Harish Rao: గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ: రేవంత్ సర్కారుపై హరీశ్ ఫైర్

Harish Rao Fires at Revanth Govt Over Congress BJP Alliance
  • కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలంటూ హరీశ్ రావు విమర్శ
  • గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ ఎద్దేవా
  • స్థానిక ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను నిలదీయాలని పిలుపు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలూ తోడు దొంగలని, వారి మధ్య 'గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ' నడుస్తోందని ఆయన ఆరోపించారు. కల్వకుర్తికి చెందిన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‍లో ఆయన నివాసంలో బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలకు బాకీ పడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను 'మా బాకీ పైసలు ఎప్పుడు ఇస్తారు?' అని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేలేకపోయారని విమర్శించారు. పక్క రాష్ట్రాలకు కేంద్రం వేల కోట్లు కేటాయిస్తుంటే, తెలంగాణకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కళకళలాడిన హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల వెలవెలబోతున్నాయని, రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని దుయ్యబట్టారు.

గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీయాలని ఆయన కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. 
Harish Rao
Revanth Reddy
BRS
BJP
Congress
Telangana Politics
Local Body Elections
Telangana Development
Medical Colleges
Hyderabad Real Estate

More Telugu News