సచిన్ ప్రపంచ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో బద్దలయ్యేనా?
- దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ప్రపంచ రికార్డుపై విరాట్ కోహ్లీ గురి
- ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల కోసం సచిన్‌తో పోటీ
- ప్రస్తుతం టెస్టుల్లో సచిన్, వన్డేల్లో కోహ్లీ చెరో 51 సెంచరీలతో సమంగా ఉన్న వైనం
- రేపటి వన్డేల్లో విరాట్ శతకం బాదితే అతని ఖాతాలో అరుదైన ఘనత
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లీకి కేవలం ఒక్క సెంచరీ మాత్రమే అవసరం. ప్రస్తుతం టెస్టుల్లో సచిన్, వన్డేల్లో కోహ్లీ చెరో 51 సెంచరీలతో సమంగా ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ ఒక్క శతకం బాదినా, ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. దక్షిణాఫ్రికాపై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 29 వన్డే ఇన్నింగ్స్‌లలో 65.39 సగటుతో 1,504 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి.
మరోవైపు గత నెలలో ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్, ఇటీవలే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో 2-0 తేడాతో ఓటమిపాలైన టీమిండియా తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే సిరీస్ జట్టుకు ఎంతో కీలకం. రేపు రాంచీలో తొలి వన్డే జరగనుండగా, డిసెంబర్ 3న రాయ్‌పూర్, 6న విశాఖపట్నంలో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి.