BJ Singh: తండ్రితో గొడవపడి సరిహద్దు దాటిన వ్యక్తి.. పాకిస్థాన్‌లో భారతీయుడి అరెస్టు

BJ Singh Arrested in Pakistan After Crossing Border
  • 100 రోజులుగా తమ ఆధీనంలోనే ఉన్నాడని తెలిపిన పాకిస్థాన్ అధికారులు
  • తండ్రితో గొడవపడి సరిహద్దు దాటిన అసోంకు చెందిన బీజే సింగ్
  • అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పాక్ అధికారులు
పాకిస్థాన్‌లోని పంజాబ్ పోలీసులు సరిహద్దులు దాటిన ఒక భారతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. పొరపాటున అతడు తమ దేశంలోకి ప్రవేశించాడని వారు పేర్కొన్నారు. తండ్రితో జరిగిన వివాదం కారణంగా అతడు ఇంటి నుంచి వెళ్లిపోయి, సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మూడు నెలల క్రితం చోటు చేసుకున్నప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారతీయుడిని అరెస్టు చేసినట్లు పాకిస్థాన్ అధికారులు ధృవీకరించారు.

అసోంకు చెందిన 31 ఏళ్ల బీజే సింగ్ ఆగస్టు 16న పంజాబ్ సరిహద్దును దాటి తమ దేశంలోకి ప్రవేశించాడని అక్కడి అధికారులు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. బీజే సింగ్ దాదాపు 100 రోజులుగా తమ ఆధీనంలో ఉన్నాడని వారు పేర్కొన్నారు.

విచారణ సందర్భంగా అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో లాహోర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసూర్ పోలీస్ స్టేషన్‌కు అతడిని అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగా తండ్రి బర్షన్ సింగ్‌తో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు బాధితుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అతడు తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
BJ Singh
India Pakistan border
Indian arrested in Pakistan
Punjab border

More Telugu News