YS Sharmila: రెండో విడత అమరావతి భూసేకరణ: చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్నలు

YS Sharmila Questions Chandrababu on Amaravati Land Acquisition
  • తొలివిడత భూముల్లో అభివృద్ధి చేయకుండా రెండో విడత సేకరణ ఎందుకని ప్రశ్న
  • ఇది రియల్ ఎస్టేట్ మాఫియా కాదా అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు
  • రాజధాని భూములపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని కోసం రెండో విడత భూసేకరణ చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ, ఇది రియల్ ఎస్టేట్ మాఫియాను తలపిస్తోందని ఆరోపించారు. "మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె కావాలా?" అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు.

తొలి విడతలో ప్రభుత్వ భూములతో కలిపి 54 వేల ఎకరాల్లో అభివృద్ధి జరిగిపోయిందని చంద్రబాబు భ్రమల్లో ఉన్నారు. రైతుల నుంచి తీసుకున్న 34 వేల ఎకరాల్లో ఒక్క కిలోమీటర్ నిర్మాణం కూడా జరగలేదని, ఐకానిక్ భవనాల ఊసే లేదని విమర్శించారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా మరో 16 వేల ఎకరాలు ఎందుకని నిలదీశారు. అదానీ, అంబానీలకు బాకీ పడ్డారని భూములు సేకరిస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు.

దేశంలోని అతిపెద్ద విమానాశ్రయాలు, అంతర్జాతీయ క్రీడా నగరాలతో పోలుస్తూ అమరావతికి వేల ఎకరాలు ఎందుకని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. ముంబై విమానాశ్రయానికి 1850 ఎకరాలు, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు 2200 ఎకరాలు సరిపోయినప్పుడు, అమరావతికి 5 వేల ఎకరాలు అవసరమా అని అడిగారు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ సిటీలు 150 ఎకరాల్లోనే ఉండగా, ఇక్కడ 2500 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.

రాజధాని భూములపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రెండో విడత భూసేకరణను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం విభజన హామీలో భాగమని, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు నిధులు అడగకుండా శాలువాలు కప్పి సన్మానాలు చేయడం ఏంటని ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు.
YS Sharmila
Andhra Pradesh
Amaravati
Chandrababu Naidu
Land Acquisition
AP Congress
Real Estate
Farmers
Bhogapuram Airport
White Paper

More Telugu News