Nara Brahmani: హిందూపురంలో బ్రాహ్మణి పర్యటన.. పాఠశాలలకు హెరిటేజ్ విరాళాలు

Nara Brahmani Visits Hindupuram Donates to Schools
  • హిందూపురంకు వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంటుందన్న బ్రాహ్మణి
  • హిందూపురం అంటే నందమూరిపురం అని వ్యాఖ్య
  • హెరిటేజ్ ఫుడ్స్ ఆధ్వర్యంలో పాఠశాలలకు కంప్యూటర్ల వితరణ
హిందూపురం నియోజకవర్గానికి రావడం తన పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉందని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి ఉపకరణాలను అందజేశారు.

ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ, "హిందూపురం అంటే నందమూరిపురం. మా తాత నందమూరి తారకరామారావు, పెదనాన్న హరికృష్ణ, తండ్రి బాలకృష్ణ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. దీన్ని బట్టి నందమూరి కుటుంబానికి ఈ నియోజకవర్గంతో ఎంత బలమైన బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు" అని గుర్తుచేశారు. భవిష్యత్తులో కూడా విద్యారంగ అభివృద్ధికి హెరిటేజ్ సంస్థ తన సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. విద్యార్థులు విలువలతో కూడిన విద్యను నేర్చుకుని, ఉన్నత స్థానాలకు ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని ఆమె ఆకాంక్షించారు.

పర్యటనలో భాగంగా చిలమత్తూరు జూనియర్ కళాశాల, లేపాక్షి మండలం కుర్లపల్లి, హిందూపురం మండలం పూలకుంటలోని ప్రభుత్వ పాఠశాలలను ఆమె సందర్శించారు. లేపాక్షి నవోదయ పాఠశాలలో హెరిటేజ్ సంస్థ ఏర్పాటు చేసిన సోలార్ గీజర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆమెకు పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Nara Brahmani
Hindupuram
Heritage Foods
Nandamuri Taraka Rama Rao
Nara Lokesh
Chilamattur
Lepakshi
School Donations
Education
Andhra Pradesh

More Telugu News