Siddaramaiah: బ్రేక్ ఫాస్ట్ భేటీలో ఏం చర్చించలేదు: సిద్ధరామయ్య, ఇంకొంతకాలం వేచి చూస్తా: డీకే శివకుమార్

Siddaramaiah says no discussions at breakfast meeting with DK Shivakumar
  • బ్రేక్ ఫాస్ట్ భేటీలో పాల్గొన్న సిద్ధరామయ్య, డీ.కే. శివకుమార్
  • తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్న సిద్ధరామయ్య
  • అధిష్ఠానం వేచి చూడమన్నది.. ఇంకొంతకాలం వేచి చూస్తానన్న డీకే శివకుమార్
అధిష్ఠానం సూచనల మేరకు డీకే శివకుమార్, తాను బ్రేక్‌ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని, కానీ ఏ విషయంపై చర్చించలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఇరువురు నేతలు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ మధ్య గతంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఇకముందు కూడా ఉండబోవని స్పష్టం చేశారు.

కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు బ్రేక్‌ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని అన్నారు. కానీ ఏ విషయంపై చర్చించలేదని ఆయన వ్యాఖ్యానించారు. నెల రోజుల ముందు నుంచి అందరిలో ఉన్న గందరగోళానికి తెరదించేందుకు ఈ బ్రేక్‌ఫాస్ట్ భేటీ జరిగిందని ఆయన వెల్లడించారు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు తమపై అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తాను, డీకే శివకుమార్ ఉమ్మడిగా ఎదుర్కొంటున్నామని అన్నారు. ప్రస్తుతం తమ పార్టీ 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికల పైన ప్రధానంగా దృష్టి సారించిందని అన్నారు. 2028లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.

అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ కర్ణాటక ప్రజల మద్దతుతో రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం తాను సిద్ధరామయ్యతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. తాము పార్టీకి విశ్వాసపాత్రులైన సైనికుల్లా పని చేస్తున్నామని అన్నారు. అధిష్ఠానం ఏం చెప్పినా మేమంతా అనుసరిస్తామని పేర్కొన్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. నాయకత్వం విషయంలోనూ అధిష్ఠానానిదే తుది నిర్ణయం అన్నారు. పార్టీ పెద్దలు తనను ఇంతకాలం వేచి ఉండమని చెప్పారని, అందుకే వేచి చూశానని, ఇంకొంతకాలం కూడా వేచి ఉండటానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.
Siddaramaiah
DK Shivakumar
Karnataka
Congress Party
Breakfast meeting
KC Venugopal

More Telugu News