Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఛార్జ్‌షీట్‌పై నిర్ణయాన్ని వాయిదా వేసిన కోర్టు

Sonia Gandhi National Herald Case Delhi Court Decision Adjourned
  • ఈడీ ఛార్జ్‌షీట్‌పై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు
  • ఈ కేసులో నిందితులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 
  • రూ. 2,000 కోట్ల ఆస్తుల అక్రమ బదలాయింపుపై ఈడీ ఆరోపణలు
  • మరిన్ని పత్రాల పరిశీలన అవసరమన్న‌ న్యాయస్థానం
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదును (ఛార్జ్‌షీట్) విచారణకు స్వీకరించాలా? వద్దా? అనే అంశంపై తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే ఈరోజు తీర్పు వెలువరిస్తారని భావించినప్పటికీ, దానిని వాయిదా వేశారు. గతంలో ఈడీ సమర్పించిన అదనపు ఆధారాలు, పత్రాలను కోర్టు పరిశీలించిన నేపథ్యంలో ఈ నెల‌ 7న తీర్పును రిజర్వ్ చేసింది. లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, నిధుల ప్రవాహం, అద్దె రసీదులను మరింత లోతుగా పరిశీలించాల్సి ఉందని కోర్టు భావిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణకర్త అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ. 2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను కేవలం రూ. 50 లక్షల నామమాత్రపు చెల్లింపుతో కాంగ్రెస్ నేతలు అక్రమంగా చేజిక్కించుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా ఈ కుట్ర జరిగిందని, అందులో సోనియా, రాహుల్ గాంధీలకు మెజారిటీ వాటాలు ఉన్నాయని ఈడీ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ కేసులో సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబే తదితరులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నిందితులుగా చేర్చారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 16న కోర్టు వెలువరించబోయే నిర్ణయంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
Sonia Gandhi
National Herald case
Rahul Gandhi
Enforcement Directorate
money laundering
Delhi court
congress leaders
Rouse Avenue court
Associated Journals Limited

More Telugu News