Muslim journalist: కశ్మీర్లో ముస్లిం జర్నలిస్టు ఇల్లు కూల్చివేత.. తన ప్లాట్ గిఫ్ట్ గా ఇచ్చిన హిందువు

Muslim Journalist Arafaj Ahmad Diang Loses Home Hindu Offers Land in Jammu Kashmir
  • ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టారంటూ ఇల్లు కూల్చేసిన అధికారులు
  • ప్రభుత్వం టార్గెట్ చేసిందని బీజేపీ, ఎల్జీ ఆదేశాల మేరకే కూల్చేశారని సీఎం ఆరోపణలు
  • గతంలో కూల్చివేతలను నిరసిస్తూ వార్తలు రాసిన జర్నలిస్ట్ అరాఫజ్ అహ్మద్ దియాంగ్
జమ్మూకశ్మీర్ లో మతసామరస్యాన్ని చాటిచెప్పే సంఘటన చోటుచేసుకుంది. ఓ ముస్లిం జర్నలిస్టు ఇంటిని ప్రభుత్వం కూల్చివేయగా.. ఆయన పొరుగింట్లో ఉండే హిందువు తన సొంత భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ముస్లిం జర్నలిస్టును తన సోదరుడిగా సంబోధిస్తూ ఇంటి నిర్మాణానికి సాయం చేస్తానని చెప్పాడు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకశ్మీర్ కు చెందిన అరాఫజ్ అహ్మద్ దియాంగ్ ఓ న్యూస్ పోర్టల్ నడిపిస్తున్నారు. జమ్మూకశ్మీర్ కు చెందిన వార్తలను ప్రముఖంగా ప్రచురిస్తూ స్థానికంగా పేరొందారు. గతంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల తొలగింపుపై వరుస కథనాలను అరాఫజ్ తన న్యూస్ పోర్టల్ లో ప్రచురించారు.

ఇంటిని కోల్పోయిన వారి ఆవేదనను ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ వ్యవహారంలో అరెస్టై జైలుకు వెళ్లారు. బెయిల్ పై బయటకు వచ్చాక కూడా తన రాతలు ఆపలేదు. దీంతో ఇటీవల అరాఫజ్ ఇంటిని కూడా ప్రభుత్వం కూల్చివేసింది. ఆయన ఉంటున్న ఇల్లు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిందేనని పేర్కొంటూ పోలీసు బలగాల పహారాలో బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. వారసత్వంగా వచ్చిన ఇంటిని ప్రభుత్వం కూల్చేయడంతో అరాఫజ్ రోడ్డున పడ్డారు. ఇది చూసి అరాఫజ్ పొరుగింట్లో ఉండే కుల్దీప్ శర్మ తన సొంత భూమిని అరాఫజ్ కు గిఫ్ట్ గా అందించాడు. తన సోదరుడు రోడ్డున పడడం చూడలేనని, ఆ భూమిలో ఇంటి నిర్మాణానికి సాయం చేస్తానని మీడియా సమక్షంలో ప్రకటించారు.

ఎల్జీపై సీఎం అబ్దుల్లా ఆరోపణలు
జమ్మూకశ్మీర్ లో ఆక్రమణల తొలగింపులో భాగంగా జమ్మూకశ్మీర్ డెవలప్ మెంట్ అథారిటీ (జేడీఏ) కూల్చివేతలు చేపడుతోంది. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హానే బాధ్యుడని, ఆక్రమణల తొలగింపు పేరుతో కొంతమందిని టార్గెట్ చేసి ఇల్లు కూల్చివేస్తున్నారని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. తన ప్రభుత్వానికి అపఖ్యాతి తేవాలన్నదే దీని వెనకున్న ఉద్దేశమని మండిపడ్డారు. అయితే, ఈ విషయంపై బీజేపీ జమ్మూకశ్మీర్ మాజీ చీఫ్ రవీందర్ రైనా స్పందిస్తూ.. కూల్చివేతలపై తాను ఎల్జీ మనోజ్ సిన్హాతో మాట్లాడానని చెప్పారు. ఆయన ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని తనకు చెప్పారన్నారు. మరి ఈ కూల్చివేతలు ఎవరి ఆదేశాల మేరకు జరుగుతున్నాయని పరోక్షంగా సీఎం అబ్దుల్లాను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Muslim journalist
house demolition
Hindu gift
Kuldeep Sharma
Arafaj Ahmad Diang
Jammu Kashmir
religious harmony
Omar Abdullah
Manoj Sinha

More Telugu News