Kailasagiri Glass Bridge: విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి.. ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రత్యేకతలివే!

Vizag Kailasagiri Glass Bridge Opening on December 1st
  • కైలాసగిరిపై గాజు వంతెన.. డిసెంబర్ 1న ప్రారంభం
  • పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనున్న గ్లాస్ బ్రిడ్జి
  • దేశంలోనే అత్యంత పొడవైన గాజు వంతెనగా రికార్డు
  • జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న లామినేటెడ్ గాజుతో నిర్మాణం
  • ఇది ఒకేసారి 500 టన్నుల భారాన్ని సైతం మోయగలదు
విశాఖ నగరవాసులు, పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జి (గాజు వంతెన) ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. డిసెంబర్ 1వ తేదీన ఈ వంతెనను అధికారికంగా ప్రారంభించి, అదే రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ వంతెనను ఎంపీ ఎం. శ్రీభరత్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభిస్తారని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ఎంవీ ప్రణవ్‌గోపాల్‌ తెలిపారు. వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్‌ సంస్థలు సంయుక్తంగా రూ. 7 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాయి. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా దీన్ని నిర్మించారు.

గాజు వంతెన విహారం.. ప్రత్యేకతలివే!
50 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ గాజు వంతెన, దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జిగా నిలవనుంది. ఇప్పటివరకు కేరళలోని 40 మీటర్ల వంతెన పేరిట ఈ రికార్డు ఉండేది. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పలుమార్లు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే దీనికి అనుమతులు ఇచ్చారు. బ్రిడ్జిపై ప్రవేశ రుసుమును ఇంకా ఖరారు చేయలేదని, ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రణవ్‌గోపాల్‌ వివరించారు.

ఈ బ్రిడ్జి నిర్మాణంలో జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 40 ఎంఎం మందం గల లామినేటెడ్ గాజును ఉపయోగించారు. ఇది ఒకేసారి 500 టన్నుల భారాన్ని మోయగలదు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా పటిష్ఠంగా నిర్మించారు. భద్రతా కారణాల దృష్ట్యా, ఒకేసారి 40 మంది పర్యాటకులను మాత్రమే బ్రిడ్జిపైకి అనుమతిస్తారు. వంతెనపై నుంచి చుట్టూ ఉన్న కొండలు, లోయ, సముద్రపు అందాలు వీక్షించడం పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
Kailasagiri Glass Bridge
Visakhapatnam
Vizag
Glass Bridge India
MV Pranav Gopal
M Sri Bharat
Tourism Andhra Pradesh
RK Adventures
Kailasagiri
Andhra Pradesh Tourism

More Telugu News