RSSVR Subramanyam: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు: సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

RSSVR Subramanyam Remand Report Reveals Tirumala Laddu Ghee Adulteration Scandal
  • లంచాలు తీసుకుని సహకరించిన టీటీడీ జీఎం సుబ్రహ్మణ్యం
  • సిట్ విచారణలో వెలుగులోకి వచ్చిన కీలక ఆధారాలు
  • కల్తీ అని తేలినా నివేదికను దాచిపెట్టిన అధికారి
  • అర్హత లేని డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టిన వైనం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించింది. అర్హత లేని డెయిరీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన లక్షల్లో లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా పనిచేస్తున్నారు.

సిట్ విచారణ ప్రకారం, సుబ్రహ్మణ్యం 2021 జులై నుంచి 2023 నవంబర్ మధ్య కాలంలో పలుమార్లు లంచాలు స్వీకరించారు. భోలేబాబా, వైష్ణవి, మాల్గంగా వంటి డెయిరీ సంస్థల ప్రతినిధుల నుంచి రూ.3.50 లక్షల నగదు, రూ.50 వేల విలువైన శాంసంగ్ ఫోన్, రూ.16,700 విలువైన వెండి ప్లేటు, వెండి నాణేలు తీసుకున్నట్లు తేలింది. ఈ డెయిరీల ప్లాంట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే, వాటికి అన్ని అర్హతలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో ఆ సంస్థలకు సులభంగా కాంట్రాక్టులు దక్కాయి.

ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రయోగశాల నివేదిక వచ్చినా సుబ్రహ్మణ్యం దానిని తొక్కిపెట్టారు. మైసూరులోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్‌లో పరీక్షించగా నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిపినట్లు స్పష్టమైంది. ఈ నివేదికను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకుండా, కల్తీ నెయ్యి సరఫరాను యథావిధిగా కొనసాగించారు.

గతంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ ఇచ్చిన ఫిర్యాదుతో భోలేబాబా డెయిరీకి అర్హత లేదని సుబ్రహ్మణ్యం కమిటీనే నివేదిక ఇచ్చింది. అయితే, ఆశ్చర్యకరంగా ఆ తర్వాత అదే సంస్థకు నెయ్యి సరఫరా కోసం సుబ్రహ్మణ్యం ఆర్డర్లు జారీ చేయడం ఆయన ప్రమేయాన్ని స్పష్టం చేస్తోందని సిట్ అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో డెయిరీలకు కోట్ల రూపాయల లాభం చేకూరగా, భక్తుల విశ్వాసం దెబ్బతిన్నదని దర్యాప్తులో వెల్లడైంది. 
RSSVR Subramanyam
Tirumala laddu
TTD
Tirumala
laddu prasadam
ghee adulteration
corruption case
YV Subba Reddy
Bhole Baba Dairy
Special Investigation Team

More Telugu News