Vladimir Putin: పుతిన్ భారత పర్యటన ఖరారు... అజెండాలో కీలక అంశాలు ఇవే!

Vladimir Putin India Visit Confirmed Key Agenda Items
  • డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత పర్యటనకు రానున్న పుతిన్
  • ప్రధాని మోదీతో కలిసి 23వ భారత-రష్యా వార్షిక సదస్సులో పాల్గొననున్న రష్యా అధినేత
  • ఇరు దేశాల చర్చల్లో రక్షణ, ఇంధన రంగాలే కీలకం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆయన పర్యటన ఉంటుందని, 23వ భారత-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. గత ఏడాది మాస్కోలో జరిగిన సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు.

ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్య సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా, రష్యా నుంచి అందాల్సిన S-400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల డెలివరీలో జరుగుతున్న జాప్యంపై భారత్ దృష్టి సారించనుంది. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు అందగా, మిగిలిన రెండు వచ్చే ఏడాది మధ్యలోగా అందాల్సి ఉంది. ఈ జాప్యంపై పుతిన్ పర్యటనలో స్పష్టత కోరతామని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. సుఖోయ్ విమానాల అప్‌గ్రేడేషన్‌తో పాటు ఇతర రక్షణ ప్రాజెక్టుల ఆలస్యంపైనా చర్చించనున్నారు.

అంతేకాకుండా, రష్యా నుంచి రెండు స్క్వాడ్రన్ల సుఖోయ్ Su-57 ఫైటర్ జెట్ల కొనుగోలు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించడంతో, ముడి చమురుపై అదనపు డిస్కౌంట్లు ఇచ్చేందుకు రష్యా ముందుకొచ్చింది. ఈ అంశంపైనా చర్చలు జరగనున్నాయి.

రెండు దేశాల మధ్య 'ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని' మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇవ్వనున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందు, 2021 డిసెంబర్‌లో పుతిన్ చివరిసారిగా భారత్‌లో పర్యటించారు.
Vladimir Putin
Putin India visit
India Russia summit
S-400 missile system
Sukhoi Su-57 fighters
India Russia relations
Narendra Modi
defense cooperation
crude oil discount
Draupadi Murmu

More Telugu News