Rahul Gandhi: బీహార్ ఓటమికి నేను కూడా బాధ్యుడినే: రాహుల్ గాంధీ

Rahul Gandhi Takes Responsibility for Bihar Election Loss
  • బీహార్ ఓటమికి తనది కూడా సమాన బాధ్యత అని చెప్పిన రాహుల్ గాంధీ
  • ఎన్నికల ఓటరు జాబితా సవరణలో ఓట్ల దొంగతనం జరిగిందని ఆరోపణ
  • ఓటమికి గల కారణాలపై కాంగ్రెస్ హైకమాండ్ సమీక్ష సమావేశం
  • ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేతల తీవ్ర విమర్శలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. ఈ ఓటమికి రాష్ట్ర నాయకత్వంతో పాటు తాను కూడా సమాన బాధ్యత వహిస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకరినొకరు నిందించుకోవడం మానేసి భవిష్యత్తుపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి కృష్ణ అల్లవారపు, పీసీసీ అధ్యక్షుడు రాజేశ్‌కుమార్ వంటి సీనియర్ నేతల సమక్షంలో ఈ సమీక్ష జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు ఓటమికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను అడ్డుపెట్టుకుని ఓట్ల దొంగతనం చేశారని ఆరోపించారు.

సమావేశంలో కొందరు అభ్యర్థులు రాష్ట్ర యూనిట్‌లో సమన్వయ లోపం, స్టార్ క్యాంపెయినర్ల కొరత వంటి అంశాలను ప్రస్తావించినా, రాహుల్ గాంధీ మాత్రం ఈ అంశాలను పక్కనపెట్టారు. మన సంస్థాగత బలహీనతే ఓటమికి కారణమైతే, బలమైన నిర్మాణం ఉన్న ఆర్జేడీ, వామపక్షాలు ఎందుకు ఓడిపోయాయని ప్రశ్నించారు.

సమావేశం ముగిశాక కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ద్వారా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని తొలగించారని, పోలింగ్ కేంద్రాల్లోనూ నగదు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీహార్‌లో తాము పోటీ చేసిన 61 స్థానాల్లో కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకున్నామని, ఈ తీర్పును అంగీకరించబోమని స్పష్టం చేశారు.
Rahul Gandhi
Bihar Election Loss
Congress Party
Mallikarjuna Kharge
KC Venugopal
Bihar Assembly Elections
AICC
Election Commission
Vote Rigging
Special Intensive Revision

More Telugu News