Asia Power Index 2025: ఆసియాలో పెరిగిన భారత్ పలుకుబడి.. అమెరికా, చైనా తర్వాత మనమే

India Ranks Third in Asia Power Index 2025
  • ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో భారత్‌కు మూడో స్థానం
  • అగ్రస్థానంలో అమెరికా.. రెండో స్థానంలో చైనా
  • 'మేజర్ పవర్' హోదాను అందుకున్న భారత్
  • ఆర్థిక, సైనిక సామర్థ్యాలు పెరగడమే ప్రధాన కారణం
ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత థింక్‌ట్యాంక్ 'లోవీ ఇన్‌స్టిట్యూట్' విడుదల చేసిన 'ఆసియా పవర్ ఇండెక్స్ 2025'లో భారత్ మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, చైనా రెండో స్థానంలో ఉంది.

ఆసియాలోని 27 దేశాలు, ప్రాంతాల సమగ్ర శక్తిసామర్థ్యాలను అంచనా వేస్తూ లోవీ ఇన్‌స్టిట్యూట్ ఏటా ఈ నివేదికను విడుదల చేస్తుంది. సైనిక సామర్థ్యం, ఆర్థిక సంబంధాలు, దౌత్యపరమైన పలుకుబడి, సాంస్కృతిక ప్రభావం వంటి 8 అంశాల పరిధిలోని 131 సూచికల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను కేటాయించారు. ఈ ఏడాది భారత్ 40 పాయింట్ల స్కోరుతో తన ర్యాంకును పదిలం చేసుకోవడమే కాకుండా, తొలిసారిగా 'మేజర్ పవర్' హోదాను అందుకుంది.

కరోనా మహమ్మారి తర్వాత బలమైన ఆర్థిక పునరుజ్జీవనం, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ప్రాబల్యం, సైనిక సామర్థ్యం మెరుగుపడటం వంటి కారణాలతో భారత్ శక్తి పెరిగిందని లోవీ ఇన్‌స్టిట్యూట్ తన నివేదికలో పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ముందున్నప్పటికీ, చైనాతో మాత్రం ఇంకా చాలా వ్యత్యాసం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

ఈ జాబితాలో 81.7 స్కోరుతో అమెరికా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, 73.7 స్కోరుతో చైనా రెండో స్థానంలో నిలిచి అమెరికాతో అంత‌రాన్ని తగ్గించుకుంటోంది. మరోవైపు 2019 తర్వాత రష్యా తన శక్తిని తిరిగి పుంజుకోవడం ఈ నివేదికలో ఒక ముఖ్యమైన అంశంగా నిలిచింది. జపాన్ శక్తి నిలకడగా ఉండగా, ఆగ్నేయాసియా దేశాలు స్వల్ప మెరుగుదలను కనబరిచాయి.
Asia Power Index 2025
India
Lowy Institute
United States
China
Asian countries
Geopolitical influence
Military power
Economic recovery
India ranking

More Telugu News