Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఆ దేశాల నుంచి అమెరికాకు వలసల బంద్

Trump to Halt Immigration from Third World Nations to US
  • వైట్ హౌస్ సమీపంలో కాల్పుల నేపథ్యంలో వలసలపై ట్రంప్ కీలక నిర్ణయం
  • 'థర్డ్ వరల్డ్' దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటన
  • బైడెన్ ప్రభుత్వ వలస విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్
  • చట్టవిరుద్ధ వలసదారులను దేశం నుంచి పంపివేస్తామని స్పష్టీకరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఓ వలసదారుడు ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో.. మూడవ ప్రపంచ దేశాల (అభివృద్ధి పరంగా వెనుకబడిన పేద దేశాలను గతంలో అలా పిలిచేవారు) నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ నేషనల్ గార్డ్ చికిత్స పొందుతూ చ‌నిపోయారు. మ‌రోక‌రు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక‌, తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగాలు, విద్య, ఆశ్రయం కోసం అమెరికాకు వెళ్లే లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం పడనుంది.

ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ వివరాలను పంచుకున్నారు. అమెరికా సాంకేతికంగా పురోగతి సాధించినప్పటికీ, ప్రస్తుత వలస విధానం దేశ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీసిందని ఆరోపించారు. "అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి మూడవ ప్రపంచ దేశాల నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాను. బైడెన్ హయాంలో అక్రమంగా దేశంలోకి వచ్చిన లక్షలాది మంది అనుమతులను రద్దు చేస్తాను. అమెరికాకు ఆస్తిగా కాకుండా భారంగా మారిన వారిని, మన దేశాన్ని ప్రేమించలేని వారిని తొలగిస్తాను" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా దేశ పౌరులు కానివారికి అన్ని రకాల ఫెడరల్ ప్రయోజనాలు, సబ్సిడీలను రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాలపై ఆధారపడేవారిని, దేశ భద్రతకు ముప్పుగా మారేవారిని, పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేనివారిని దేశం విడిచి పంపిస్తామని హెచ్చరించారు. "ఈ పరిస్థితిని 'రివర్స్ మైగ్రేషన్' ద్వారానే సరిదిద్దగలం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, అమెరికా వలసలను నిలిపివేసిన దేశాల జాబితాలో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, ఇరాన్, క్యూబా, వెనెజులా, యెమెన్ వంటి దేశాలు ఉండటం గమనార్హం. 

వలసలను నిలిపివేసిన 'థర్డ్ వరల్డ్' దేశాల జాబితా ఇదే..
ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, బురుండి, చాద్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, క్యూబా, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లావోస్, లిబియా, సియెర్రా లియోన్, సోమాలియా, సూడాన్, టోగో, తుర్క్‌మెనిస్థాన్, వెనెజూలా, యెమెన్.
Donald Trump
US immigration
Third World countries
immigration ban
America
Afghanistan
Biden administration
national security
reverse migration
US jobs

More Telugu News