Love Affair: 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రేమాయణం.. కలిసి బతకాలని హైదరాబాదుకు పయనం.. చివ‌రికి

Vijayawada Teens Eloping Case Resolved by Police in Hyderabad
  • కలిసి జీవించాలని ఇంటి నుంచి పారిపోయిన మైనర్లు
  • బాలుడి పుట్టిన రోజునాడు హైదరాబాద్‌కు పయనం
  • మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ గుర్తింపు
  • పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగింత
విజయవాడకు చెందిన 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక కలిసి జీవించాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే వారి ఆచూకీ కనుగొని, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

వివరాల్లోకి వెళితే.. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు మైనర్లు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. బాలుడు 8వ తరగతి, బాలిక 9వ తరగతి చదువుతోంది. తెలియని వయసులో ఒకరిపై ఒకరు ఆకర్షణ పెంచుకుని, ప్రేమ అనుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 26న బాలుడి పుట్టినరోజు కావడంతో ఓ నిర్ణయం తీసుకున్నారు. స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వచ్చిన బాలిక, నేరుగా బాలుడి ఇంటికి వెళ్లింది. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసుకున్నారు. ఆ తర్వాత బాలుడు తన తండ్రి ఫోన్‌తో పాటు ఇంట్లోని రూ.10 వేలు తీసుకుని బాలికతో కలిసి హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కాడు.

సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఇరు కుటుంబాల తల్లిదండ్రులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్కూల్‌కు రాలేదని తెలియడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఇద్దరూ కలిసి వెళ్తున్నట్లు గుర్తించారు. బాలుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌పై నిఘా పెట్టారు.

మొదట ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినా, తర్వాత ఆన్ చేయడంతో వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు సిగ్నల్ ద్వారా గుర్తించారు. వెంటనే విజయవాడ పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు. వనస్థలిపురంలో బస్సు దిగిన వీరిని ఓ ఆటోడ్రైవర్, ఇల్లు అద్దెకు కావాలని అడగటంతో అనుమానించి తన ఇంటికి తీసుకెళ్లి ఆరా తీశాడు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఈలోపే అక్కడికి చేరుకున్న పోలీసులు మైనర్లను విజయవాడకు తీసుకొచ్చి, కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Love Affair
Vijayawada
Minor Couple
Hyderabad
Missing children
Police investigation
Vanastalipuram
CCTV footage
Krishna Lanka

More Telugu News