China Train Accident: పట్టాలపై పనిచేస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన రైలు.. చైనాలో 11 మంది దుర్మరణం

China Train Accident 11 Workers Killed in Yunnan Province
  • యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్‌లో జరిగిన దుర్ఘటన
  • ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే అధికారులు
  • ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లో భద్రతపై ఆందోళన
చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యునాన్ ప్రావిన్స్‌లో రైల్వే ట్రాక్‌పై పనిచేస్తున్న కార్మికులపైకి ఒక రైలు దూసుకెళ్లడంతో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గత కొన్నేళ్లలో చైనా రైల్వే నెట్‌వర్క్‌లో జరిగిన అత్యంత తీవ్రమైన ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

కున్మింగ్‌ నగరంలోని లుయోయాంగ్ టౌన్ రైల్వే స్టేషన్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భూకంపాలను గుర్తించే పరికరాలను పరీక్షిస్తున్న ఒక టెస్టింగ్ రైలు స్టేషన్‌లోని ఒక వంపు వద్ద వెళ్తుండగా.. అప్పటికే ట్రాక్‌పైకి వచ్చిన నిర్మాణ కార్మికులను ఢీకొట్టిందని కున్మింగ్ రైల్వే బ్యూరో తెలిపింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు, స్థానిక యంత్రాంగం అత్యవసర సహాయక చర్యలు చేపట్టాయని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం స్టేషన్‌లో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించామని, ప్రమాదానికి గల కారణాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు కున్మింగ్ రైల్వే అథారిటీ సంతాపం తెలిపింది.
China Train Accident
Yunnan Province
Kunming
Railway Workers
Train Collision
Luoyang Town
China Rail Network
Rail Accident

More Telugu News