Manoj Tiwary: గంభీర్‌కు ఆ విజయాల క్రెడిట్ లేదు.. అవి రోహిత్, ద్రవిడ్ వల్లే ద‌క్కాయి: మనోజ్ తివారీ

Gautam Gambhir Criticized by Manoj Tiwary After Test Series Loss
  • టెస్ట్ కోచ్ పదవి నుంచి గంభీర్‌ను తొలగించాలని డిమాండ్ చేసిన మనోజ్ తివారీ
  • సొంతగడ్డపై ద‌క్షిణాఫ్రికాతో సిరీస్ ఓటమి గంభీర్ వల్లేనని ఆరోపణ
  • భారత టెస్ట్ క్రికెట్‌ను కాపాడాలంటే గౌతీకి గుడ్ బై చెప్పాల్సిందేన‌ని వ్యాఖ్య
  • ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలు రోహిత్, ద్రవిడ్ నిర్మించిన జట్టువన్న తివారీ
  • ఇంగ్లండ్‌లో సిరీస్ డ్రా కావడం కూడా గంభీర్ ఘనత కాదన్న మాజీ క్రికెట‌ర్‌
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ ఆటగాడు మనోజ్ తివారీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. సొంతగడ్డపై ద‌క్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 0-2 తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో గంభీర్‌ను టెస్ట్ కోచ్ పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశాడు. రెండో టెస్టులో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ఈ ఓటమి తనను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదని, గంభీర్ అనుసరిస్తున్న తప్పుడు వ్యూహాల వల్లే ఇది జరిగిందని తివారీ ఆరోపించాడు. "ఈ ఫలితం ముందే ఊహించిందే. జట్టులో అనుసరిస్తున్న ప్రక్రియ, ప్రణాళికలు సరైనవి కావు. జట్టులో పదేపదే మార్పులు చేయడం స్పష్టంగా కనిపించింది. ఈ ధోరణి గత కొన్ని సిరీస్‌ల నుంచి కొనసాగుతోంది" అని ఆయన ఓ జాతీయ మీడియాతో అన్నారు.

"భారత టెస్ట్ క్రికెట్‌ను కాపాడాలంటే బీసీసీఐ వెంటనే ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలి. టెస్టులకు ప్రత్యేక కోచ్‌ను నియమించడానికి ఇదే సరైన సమయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని తివారీ పేర్కొన్నాడు.

ఇటీవల గంభీర్ తన హయాంలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచామని, ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ డ్రా చేసుకున్నామని చెప్పడాన్ని తివారీ తప్పుబట్టాడు. "గంభీర్ చెబుతున్న వన్డే జట్టును రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ కలిసి నిర్మించారు. గంభీర్ కోచ్‌గా లేకపోయినా భారత్ ఆ టోర్నీలు గెలిచేది. ఇక, ఇంగ్లండ్ సిరీస్ డ్రా కావడం గొప్పేమీ కాదు. ఆఖరి రోజు ఇంగ్లండ్ ఆటగాళ్లు అనవసర షాట్లు ఆడటంతోనే సిరీస్ 3-1తో కోల్పోకుండా బయటపడ్డాం" అని తివారీ విమర్శించాడు. కిందిస్థాయిలో అనుభవం లేని ఒక వైట్-బాల్ మెంటర్‌ను హెడ్ కోచ్‌గా చూడటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించాడు.


Manoj Tiwary
Gautam Gambhir
Rohit Sharma
Rahul Dravid
India vs South Africa
Test Series
Indian Cricket Team
BCCI
Cricket Coach

More Telugu News