Chandrababu: అమరావతి అభివృద్ధి నా బాధ్యత.. రాజధాని రైతులకు సీఎం కీలక హామీలు

Amaravati Development Chandrababu Naidu Promises Key Assurances to Capital Farmers
  • రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
  • అమరావతి గుర్తింపుపై కేంద్రంతో మరోసారి చర్చిస్తామని హామీ
  • రిటర్నబుల్ ప్లాట్లు అమ్ముకోవద్దు, ధరలు పెరుగుతాయని రైతులకు సూచన
  • రెండో విడత భూ సమీకరణకు సంపూర్ణ మద్దతిస్తామన్న రైతులు
  • ఇకపై రైతుల సమస్యలపై నిరంతరం సమీక్షలు జరుపుతానన్న సీఎం
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు గడువు పొడిగింపు కోసం కూడా కేంద్రంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలోని ఐదో బ్లాకులో అమరావతి రైతులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. "జరీబు, గ్రామ కంఠాలు, లంక భూముల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. లంక భూములను ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చాను. ఏమైనా సమస్యలుంటే ముందుగా త్రిసభ్య కమిటీతో చర్చించండి, అవసరమైతే నేను కూడా మీతో మాట్లాడతాను. ఇకపై అమరావతి రైతుల సమస్యలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తాను" అని హామీ ఇచ్చారు.

రాజధాని రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను అమ్ముకోవద్దని చంద్రబాబు సూచించారు. "భూముల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. హైదరాబాద్‌లో ఒకప్పుడు తక్కువగా ఉన్న భూముల విలువ ఇప్పుడు ఎకరం రూ.170 కోట్లకు చేరింది. అమరావతి అభివృద్ధి ఫలాలను మొదట అందుకోవాల్సింది రైతులే. అమరావతికి న్యాయం చేయడం నా బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. బిట్స్ పిలానీ, క్వాంటం వ్యాలీ వంటి సంస్థలు వస్తున్నాయని, తిరుమల తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రెండో విడత భూ సమీకరణ ద్వారా మరిన్ని భూములు సేకరించి అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి హామీలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై 'అమరావతి డెవలప్‌మెంట్ అసోసియేషన్'గా ఏర్పడి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. రెండో విడత భూ సమీకరణకు పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
Chandrababu
Amaravati
Andhra Pradesh
Capital Gains Tax
Land Pooling
AP CRDA
Farmers Meeting
Real Estate
Guntur District
Pemaasani Chandrasekhar

More Telugu News