UAE-Pakistan: పాకిస్థానీయులకు యూఏఈ భారీ షాక్.. వీసాలు నిలిపివేత

UAE Stops Issuing Visas To Pakistanis
  • పాకిస్థాన్ పౌరులకు వీసాలు నిలిపివేసిన యూఏఈ
  • నేర కార్యకలాపాలు, భిక్షాటన పెరిగిపోవడమే కారణం
  • నిషేధాన్ని ధ్రువీకరించిన పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ
  • దౌత్య, బ్లూ పాస్‌పోర్ట్‌లకు మాత్రమే మినహాయింపు
పాకిస్థాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) భారీ షాక్ ఇచ్చింది. పాకిస్థాన్ పౌరులకు వీసాల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈకి వచ్చిన తర్వాత పాకిస్థానీయులు భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కార‌ణాల‌తో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల కార్యదర్శి సల్మాన్ చౌదరి స్వయంగా ధ్రువీకరించారు.

సెనేట్ మానవ హక్కుల కమిటీ సమావేశంలో సల్మాన్ చౌదరి మాట్లాడుతూ.. యూఏఈ విధించిన ఈ నిషేధాన్ని తొలగించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామంపై పాకిస్థానీ పత్రిక 'డాన్' ఒక కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా వర్క్ వీసాలపై కాకుండా విజిట్ వీసాలపై యూఏఈకి వచ్చి చాలామంది పాకిస్థానీయులు భిక్షాటనకు పాల్పడుతున్నారని, అందుకే అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రమోటర్ ఐసమ్ బేగ్ తెలిపారు.

ప్రస్తుతం యూఏఈ కేవలం దౌత్య, బ్లూ పాస్‌పోర్ట్‌లు ఉన్నవారికి మాత్రమే వీసాలు మంజూరు చేస్తోంది. చాలా తక్కువ మందికి, అది కూడా ఎన్నో ఇబ్బందుల తర్వాత వీసాలు లభిస్తున్నాయని సెనేటర్ సమీనా ముంతాజ్ జెహ్రీ పేర్కొన్నారు. 

గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా దుబాయ్, అబుదాబి పాకిస్థానీ ఉద్యోగార్థులకు ప్రధాన గమ్యస్థానాలు. ఏటా 8 లక్షల మందికి పైగా పాకిస్థానీలు గల్ఫ్ దేశాలకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. గతేడాది డిసెంబర్‌లో కూడా పాకిస్థాన్‌లోని 30 నగరాల ప్రజలపై యూఏఈ, సౌదీ అరేబియా సహా పలు గల్ఫ్ దేశాలు వీసాలపై నిషేధం విధించాయి. స్మగ్లింగ్, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, భిక్షాటన కేసులు పెరగడమే ఇందుకు కారణంగా నిలిచింది.
UAE-Pakistan
UAE
Pakistan
UAE visa ban
Salman Choudary
Visit visa
Gulf countries
Smuggling
Human trafficking
Begging
Dubai

More Telugu News