Rishabh Pant: క్లీన్ స్వీప్ ఓటమిపై క్షమాపణలు చెప్పిన రిషబ్ పంత్

Rishabh Pant Apologizes for Clean Sweep Loss
  • సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం
  • టెస్ట్ సిరీస్ ను 0-2తో కోల్పోయిన టీమిండియా
  • అభిమానుల అంచనాలను అందుకోలేకపోయామని క్షమాపణ చెప్పిన పంత్
  • మంచి క్రికెట్ ఆడలేకపోయామని బహిరంగంగా అంగీకారం
  • మరింత బలంగా పుంజుకుంటామని భారత జట్టు తరఫున హామీ
సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయంపై తాత్కాలిక సారథి, వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ స్పందించాడు. తాము మంచి క్రికెట్ ఆడలేదని అంగీకరిస్తూ, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమాపణలు చెప్పాడు. కచ్చితంగా పుంజుకుని, మరింత బలంగా తిరిగివస్తామని హామీ ఇచ్చాడు.

రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయి క్లీన్ స్వీప్ కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్ ఇన్స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. "గత రెండు వారాలుగా మేం సరైన ప్రదర్శన చేయలేదన్నది వాస్తవం. ఒక జట్టుగా, ఆటగాళ్లుగా మేం ఎప్పుడూ అత్యుత్తమంగా రాణించి కోట్లాది మంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనుకుంటాం. ఈసారి మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి. క్రీడలు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మేం కష్టపడి, లోపాలను సరిదిద్దుకుని బలంగా పుంజుకుంటాం. మీ మద్దతుకు ధన్యవాదాలు" అని పంత్ పేర్కొన్నాడు.

రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా గౌహతిలో జరిగిన రెండో టెస్టుకు దూరం కావడంతో, పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 2000 తర్వాత భారత గడ్డపై సౌతాఫ్రికాకు ఇది రెండో టెస్ట్ సిరీస్ విజయం.

మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ, "ఈ ఫలితం తీవ్ర నిరాశపరిచింది. ప్రత్యర్థి జట్టు సిరీస్‌ను పూర్తిగా శాసించింది. ఒక జట్టుగా మేం అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. అదే మా ఓటమికి కారణమైంది" అని ఓటమికి గల కారణాలను వివరించాడు. 
Rishabh Pant
India vs South Africa
India Test Series Loss
Cricket
Indian Cricket Team
South Africa Cricket
Shubman Gill
Gauhati Test
Test Series Defeat
Cricket Series

More Telugu News