మొదటి నుంచి కూడా రామ్ తన కథల్లో .. తన పాత్రలలో జోష్ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఆరంభంలో లవర్ బాయ్ పాత్రలు చేస్తూ వచ్చిన రామ్, తన కథలకు మాస్ యాక్షన్ జోడించడం మొదలుపెట్టి చాలాకాలమే అవుతోంది. ఈ సారి మాస్ లుక్ తో .. రొమాంటిక్ కామెడీ టచ్ తో ఆయన చేసిన సినిమానే 'ఆంధ్రా కింగ్ తాలూకా'. మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో, దర్శకుడు మహేశ్ తెరకెక్కించిన సినిమా ఇది.
కథ: అది ఆంధ్రప్రదేశ్ లోని 'గోడపల్లి లంక' గ్రామం. ఆ గ్రామంలోనే సాగర్ (రామ్) కుటుంబం నివసిస్తూ ఉంటుంది. తండ్రి సింహాద్రి (రావు రమేశ్) .. తల్లి పుష్ప (తులసి) ఇదే అతని కుటుంబం. ఆ గ్రామస్తులు బయట ప్రపంచంలోకి రావాలంటే పడవలో గోదావరిని దాటాల్సిందే. ఆ గ్రామానికి మరో దారిలేదు .. కరెంట్ సౌకర్యం ఉండదు. అక్కడ ఎవరికీ చదువు లేదు. సింహాద్రి పట్టుదల మీద సాగర్ కి మాత్రం కాస్త చదువు వంటబడుతుంది. కాకపోతే అతనికి సినిమా పిచ్చి ఎక్కువ. స్టార్ హీరో సూర్య (ఉపేంద్ర)కి వీరాభిమాని.
టౌన్లో 'మహాలక్ష్మీ' థియేటర్ ను పురుషోత్తం (మురళీశర్మ) నడుపుతుంటాడు. అతని కూతురే మహాలక్ష్మి ( భాగ్యశ్రీ బోర్సే). ఆ థియేటర్ లోనే హీరో సూర్య సినిమాలు ఎక్కువగా ఆడుతుంటాయి. రిలీజ్ రోజున అక్కడే సాగర్ తన ఫ్రెండ్స్ తో కలిసి హడావిడి చేస్తుంటాడు. సాగర్ చదువుతున్న కాలేజ్ లోనే మహాలక్ష్మి చదువుతుంటుంది .. కాకపోతే జూనియర్. ఇద్దరి పరిచయం మాత్రం థియేటర్లోనే జరుగుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది.
హీరో సూర్య 100 వ సినిమా ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఆగిపోతుంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని వెళ్లాలంటే 3 కోట్లు అవసరమవుతాయి. ఆ డబ్బును సర్దుబాటు చేయడానికి సూర్య చేసే ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే, సాగర్ - మహాలక్ష్మి ప్రేమ వ్యవహారం పురుషోత్తమ్ కి తెలుస్తుంది. ఆయన సాగర్ పై మండిపడతాడు. అతణ్ణి మాత్రమే కాదు అతని ఊరును అవమానపరుస్తాడు.
పురుషోత్తం కంటే పెద్ద థియేటర్ ను తన ఊర్లో కడతాననీ .. సూర్య 100వ సినిమాను తన థియేటర్ లో రిలీజ్ చేస్తాననీ.. అప్పుడే మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని సాగర్ ఛాలెంజ్ చేస్తాడు. అలా ఆగిపోయిన సూర్య సినిమాతో సాగర్ ఛాలెంజ్ ముడిపడిపోతుంది. తన ఛాలెంజ్ ను నెరవేర్చుకోవడం కోసం సాగర్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? ఒక అభిమానిగా .. ప్రేమికుడిగా ఏ పాత్రకు న్యాయం చేస్తాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఇది సినిమా నేపథ్యంలో నడిచే సినిమా. అందుకు తగినట్టుగానే సినిమా షూటింగుతోనే ఫస్టు సీన్ మొదలవుతుంది. ఈ సినిమాలో హీరో .. ఒక స్టార్ హీరోకి వీరాభిమాని. ఇతగాడు ఒక థియేటర్ యజమాని కూతురి దృష్టిలో హీరో. అనుకోకుండా వీరి పెళ్లి ఆ స్టార్ హీరో సినిమాతో .. ఆ సినిమాతోనే ఓపెనింగ్ జరుపుకోనున్న థియేటర్ తో ముడిపడిపోవడం నాటకీయ పరిణామం.
సూర్య 100వ సినిమా విషయంలో అతని గౌరవాన్ని కాపాడటం .. మనసుపడిన అమ్మాయికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం .. ఆ అమ్మాయి తండ్రికి విసిరిన ఛాలెంజ్ ను నెరవేర్చడం .. ఇక తన ఊరుకు ఒక గుర్తింపును తీసుకుని రావడం .. ఇలా చాలా బాధ్యతలను హీరో భుజాలపై పెట్టి నడిపించాడు దర్శకుడు. తన ఎనర్జీ లెవెల్స్ మరింత పెంచుకుంటూ, ఆ బరువు బాధ్యతలను మోయడానికి రామ్ తన వంతు ప్రయత్నం చేశాడనే చెప్పాలి.
ఈ సినిమా మొత్తంలో కథా కథనాల సంగతి అలా ఉంచితే, హీరో తండ్రిగా రావు రమేశ్ ను .. హీరోయిన్ తండ్రిగా మురళీశర్మను ఎంచుకోవడంలో దర్శకుడు ఎక్కువ మార్కులను కొట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కథ బలపడటంలో ఈ రెండు పాత్రలు ప్రధానమైనవిగా కనిపిస్తాయి. కీలకమైన స్థానాల్లో కనిపించే ఈ పాత్రలు ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయి.
పనితీరు: ఈ సినిమా కథ .. కథనం రొటీన్ కి భిన్నంగా అయితే వెళ్లలేకపోయాయి. దర్శకుడు పాత్రలను డిజైన్ చేసిన తీరు .. వాళ్ల నుంచి అవుట్ పుట్ ను రాబట్టిన విధానం గొప్పగా అనిపిస్తుంది. కానీ లవ్ .. ఎమోషన్స్ పరంగా ఆశించిన స్థాయిలో కనెక్ట్ చేయలేకపోయారని అనిపిస్తుంది.
రామ్ కాస్త ఒళ్లు చేశాడు .. అయినా ఆయన ఎనర్జీ లెవెల్స్ లో తేడా రాలేదు. అయితే ఈ పాత్రలో తన హెయిర్ స్టైల్ పై కాస్త దృష్టి పెట్టవలసింది. ఇక భాగ్యశ్రీ గ్లామర్ పరంగా ప్రధానమైన ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. ఈ సినిమాలోను చూపులతో ఆమె చేసిన విన్యాసాలు కుర్రాళ్ల మనసులు చిక్కుబడిపోతాయి. ఈ సినిమా కథకు రామాయణాన్ని అన్వయిస్తూ మాట్లాడే సీన్ లో రావు రమేశ్, కూతురు ప్రేమ పట్ల ఆవేశాన్ని వ్యక్తం చేసే పాత్రలో మురళీశర్మ నటన గొప్పగా అనిపిస్తుంది.
సిద్ధార్థ - జార్జ్ విలియమ్స్ కెమెరా పనితనం బాగుంది. సన్నివేశాలను తెరపై అందంగా ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. వివేక్ - మెర్విన్ బాణీలు ఫరవాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడా కాస్త సన్నివేశాలను దాటి వెళ్లింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. 'నువ్వెవరో తెలుసుకోవడానికి వచ్చి, నేనేమిటో తెలుసుకున్నాను' .. 'నాకు పేరు పెట్టావు .. ఆ పేరును నిలబెట్టావు' వంటి డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి.
ముగింపు: తేలికగా చెప్పవలసిన కొన్ని సన్నివేశాలు బలంగా చెప్పడానికి ట్రై చేయడం, బలమైన కొన్ని సన్నివేశాలను తేలికగా తేల్చి పారేయడం ఒక లోపంగా మనకి కనిపిస్తుంది. 100 సినిమాలు చేసిన ఒక హీరో దగ్గర 3 కోట్లు లేకపోవడం, అప్పుగా కూడా ఆయన ఏర్పాటు చేసుకోలేకపోవడం ప్రేక్షకులకు మింగుడుపడని విషయంగా అనిపిస్తుంది. ఈ లాజిక్ ను పక్కన పెడితే, రామ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.
'ఆంధ్ర కింగ్ తాలూకా'- మూవీ రివ్యూ!
Andhra King Taluka Review
- రామ్ నుంచి 'ఆంధ్ర కింగ్ తాలూకా'
- తగ్గని రామ్ ఎనర్జీ లెవెల్స్
- అందంగా మెరిసిన భాగ్యశ్రీ
- బలమైన పాత్రల్లో రావు రమేశ్ - మురళీశర్మ
- రామ్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్
Movie Details
Movie Name: Andhra King Taluka
Release Date: 2025-11-27
Cast: Ram, Bhagyashri Borse, Upendra, Rao Ramesh, Murali Sharma, Tulasi
Director: Mahesh Babu P
Music: Vivek–Mervin
Banner: Mythri Movie Makers
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer