Supreme Court: వాళ్లకి ఆధార్ కార్డు ఉంటే ఇక ఓటు హక్కు ఇచ్చినట్టేనా?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Should Intruders With Aadhaar Be Made Voter Supreme Courts Big Question
  • చొరబాటుదారులకు ఆధార్ కార్డులు జారీ కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన
  • ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? అని కీలక ప్రశ్న
  • పౌరసత్వానికి ఆధార్ కార్డు రుజువు కాదని మరోసారి స్పష్టీకరణ
  • ఓటర్ల జాబితా సవరణపై ఈసీకి డిసెంబర్ 1 వరకు గడువు
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా? అని సుప్రీంకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది. ఆధార్ కార్డు కేవలం సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడానికి మాత్రమేనని, దానిని పౌరసత్వానికి లేదా ఓటు హక్కుకు రుజువుగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను (SIR) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. "పొరుగు దేశం నుంచి వచ్చిన ఓ కూలీకి రేషన్ కోసం ఆధార్ కార్డు ఇస్తే, అతడిని ఓటరుగా కూడా చేయాలా?" అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కేవలం పోస్టాఫీసు కాదని, ఓటరు దరఖాస్తుతో పాటు సమర్పించిన పత్రాల వాస్తవికతను పరిశీలించే అధికారం దానికి ఉందని స్పష్టం చేసింది.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఈసీ చేపట్టిన ప్రక్రియ నిరక్షరాస్యులైన సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధమైన భారం మోపుతోందని అన్నారు. ఫారాలు నింపడం తెలియని వారిని జాబితా నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధార్ పౌరసత్వానికి తిరుగులేని రుజువు కాకపోయినా, నివాసానికి సంబంధించి ప్రాథమిక ఆధారంగా పరిగణించాలని వాదించారు.

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు సంబంధించిన పిటిషన్లపై డిసెంబర్ 1లోగా సమాధానం దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
Supreme Court
Aadhar card
Voter ID
Election Commission of India
Kapil Sibal
Voter list
Indian citizenship
Justice Surya Kant
Voter rights

More Telugu News