Dmitry Nuyanzhin: క్లయింట్ల కోసం కొత్త ప్రయోగం.. నిద్రలోనే ప్రాణాలు విడిచిన ఫిట్‌నెస్ కోచ్

Fitness Coach Dmitry Nuyanzhin Dies After Extreme Weight Gain Experiment
  • వింత ఛాలెంజ్‌లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన రష్యన్ ఫిట్‌నెస్ కోచ్
  • బరువు తగ్గే ప్రోగ్రామ్ కోసం అతిగా తిని బరువు పెరిగే ప్రయత్నం
  • నిద్రలోనే గుండె పనిచేయకపోవడంతో మృతి చెందినట్లు నిర్ధారణ
రష్యాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. తన క్లయింట్లలో స్ఫూర్తి నింపేందుకు సరికొత్త ఛాలెంజ్ ను స్వీకరించిన ఓ ఫిట్‌నెస్ కోచ్, ఆ ప్రయత్నంలోనే ప్రాణాలు కోల్పోయాడు. బరువు తగ్గే కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడం కోసం, తానే స్వయంగా బరువు పెరిగి చూపించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అతిగా ఆహారం తిని గుండెపోటుతో మరణించాడు.

వివరాల్లోకి వెళితే.. రష్యాలోని ఒరెన్‌బర్గ్ నగరానికి చెందిన 30 ఏళ్ల డిమిత్రి నుయాంజిన్, ఫిట్‌నెస్ కోచ్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పనిచేస్తున్నాడు. తన బరువు తగ్గించే ప్రోగ్రామ్‌కు ప్రచారం కల్పించేందుకు, ముందుగా 25 కిలోల బరువు పెరిగి, ఆ తర్వాత దాన్ని తగ్గించి చూపించాలని ఓ ఛాలెంజ్ ప్రారంభించాడు. ఇందులో భాగంగా కొన్ని వారాలుగా రోజూ 10,000 క్యాలరీలకు పైగా జంక్ ఫుడ్ తినడం మొదలుపెట్టాడు.

ఉదయం పూట పేస్ట్రీలు, కేకులు, మధ్యాహ్నం మయోన్నైస్‌తో డంప్లింగ్స్, రాత్రి బర్గర్, రెండు చిన్న పిజ్జాలు తినేవాడు. చనిపోవడానికి ఒక రోజు ముందు తాను అనారోగ్యంగా ఉన్నానని, శిక్షణా తరగతులను రద్దు చేసుకుంటున్నానని స్నేహితులకు తెలిపాడు. అయితే, ఆ మరుసటి రోజే నిద్రలోనే గుండె ఆగిపోవడంతో మరణించాడు.

ఈ నెల‌ 18న పెట్టిన తన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తాను నెల రోజుల్లోనే 13 కిలోలు పెరిగి 105 కిలోలకు చేరుకున్నట్లు పేర్కొన్నాడు. నుయాంజిన్ మరణవార్తతో సోషల్ మీడియాలో చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతూనే, ఇలాంటి విపరీతమైన ఛాలెంజ్‌లు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన గుర్తుచేస్తోందని పలువురు కామెంట్లు పెట్టారు. పదేళ్లుగా ఫిట్‌నెస్ కోచ్‌గా పనిచేస్తున్న నుయాంజిన్ మృతి అందరినీ కలచివేసింది.
Dmitry Nuyanzhin
Fitness coach
Weight loss challenge
Russian fitness coach
Orenburg
Heart attack
Social media influencer
Extreme dieting
Unhealthy lifestyle
Calorie challenge

More Telugu News