Shiva Jyothi: యాంకర్ శివ జ్యోతి తిరుమల శ్రీవారి దర్శనంపై నిషేధం!

Shiva Jyothi Banned from Tirumala Temple Visit After Brothers Remarks
  • శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు 
  • దర్శనానికి వీల్లేకుండా శివ జ్యోతి ఆధార్ కార్డు బ్లాక్
  • వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన యాంకర్ శివ జ్యోతి
  • భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే కఠిన చర్యలని టీటీడీ హెచ్చరిక
ప్రముఖ టెలివిజన్ యాంకర్ శివ జ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టి షాక్ ఇచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆమె తమ్ముడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో, శివ జ్యోతిని భవిష్యత్తులో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోకుండా నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఆధార్ కార్డును బ్లాక్ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
ఇటీవల శివ జ్యోతి తమ్ముడు సోషల్ మీడియాలో తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత, ధరపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఫిర్యాదులతో స్పందించిన టీటీడీ విజిలెన్స్ విభాగం, ఈ ఘటనపై విచారణ చేపట్టింది. అనంతరం సమావేశమైన టీటీడీ బోర్డు, శివ జ్యోతి ఆధార్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆమె ఎలాంటి దర్శన టికెట్లు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది.
 
వివాదం ముదురుతుండటంతో శివ జ్యోతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "మా తమ్ముడి వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించండి. మా కుటుంబ సభ్యులు ఎప్పటికీ శ్రీవారి భక్తులే" అని పేర్కొంటూ ఆమె క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ భక్తుల ఆగ్రహం చల్లారకపోవడంతో టీటీడీ తాజా నిర్ణయం తీసుకుంది.
 
శ్రీవారి ప్రసాదం, ఆలయ విధానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 
Shiva Jyothi
Tirumala
TTD
Ladoo Prasadam
Tirupati
Andhra Pradesh
Temple
Controversy
Ban
Anchor Shiva Jyothi

More Telugu News