IMD: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

IMD Warns of Heavy Rains in Andhra Pradesh Due to Cyclone
  • బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
  • శనివారం నుంచి ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక
  • మలక్కా జలసంధిలో 180 ఏళ్ల తర్వాత అరుదైన తుపాను
నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. వాయవ్య దిశగా కదులుతూ శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరువవుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో శనివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు; ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం ఈ జిల్లాలతో పాటు కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

మలక్కా జలసంధిలో అరుదైన తుపాను
ఇండోనేసియా సమీపంలోని మలక్కా జలసంధిలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం 'సెన్యార్' తుపానుగా బలపడింది. ఇది వెంటనే ఇండోనేసియాలో తీరం దాటింది. దీని ప్రభావం భారత్‌పై ఉండదని ఐఎండీ స్పష్టం చేసింది. మలక్కా జలసంధిలో తుపాను ఏర్పడటం చాలా అరుదని, 1842 తర్వాత ఈ ప్రాంతంలో తుపాను బలపడటం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
IMD
Andhra Pradesh Rains
Nellore
Chittoor
Bay of Bengal Cyclone
Heavy Rainfall Alert
Weather Forecast Andhra Pradesh
Tamil Nadu Weather
Puducherry Weather
Cyclone Senyar

More Telugu News