Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో లోకేశ్‌ కనగరాజ్ సినిమా?.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

Pawan Kalyan and Lokesh Kanagaraj Movie in Discussion
  • భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న కేవీఎన్ ప్రొడక్షన్స్
  • తమిళ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టిన లోకేశ్‌
  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత పవన్ తదుపరి చిత్రం ఇదేనని ప్రచారం
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ సృష్టించుకున్న దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్ ఇప్పుడు తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఆయన ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే వార్త ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కన్నడలో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు సమాచారం.

‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో గ్యాంగ్‌స్టర్ డ్రామాలను కొత్తగా ఆవిష్కరించిన లోకేశ్‌, ప్రస్తుతం రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత రజనీకాంత్-కమల్‌హాసన్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం లోకేశ్‌ ఆ ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి, పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకే ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. ఈ సినిమాలో నటించేందుకు పవన్ కూడా సుముఖంగా ఉన్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన మరో ప్రాజెక్ట్‌కు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి చిత్రం లోకేశ్‌ దర్శకత్వంలోనే ఉంటుందన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. అయితే, ఈ వార్తలపై స్పష్టత రావాలంటే నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Pawan Kalyan
Lokesh Kanagaraj
Telugu Cinema
KVN Productions
Gangster Drama
Usthad Bhagat Singh
Kollywood
Tollywood
Rajinikanth
Kamal Haasan

More Telugu News