K Dhanunjaya Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంలో ఊరట

K Dhanunjaya Reddy Gets Relief in AP Liquor Scam Case
  • డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసిన హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు లొంగిపోవాల్సిన అవసరం లేదని వెల్లడి 
  • నిందితులను కస్టడీలో ఉంచి ఏం సాధిస్తారని ప్రశ్నించిన ధర్మాసనం
  • కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న కె ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. వారికి ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేస్తూ, ఈ నెల 26లోపు లొంగిపోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు నిందితులు లొంగిపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విచారణ వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ కేసులో 400 మంది సాక్షులు ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
 
దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ప్రాసిక్యూషన్ ఎంతమంది సాక్షులను చూపినా, విచారణ క్రమంలో ఆ జాబితా సగానికి తగ్గిపోవచ్చని అభిప్రాయపడ్డారు. "వారిని కస్టడీలో ఉంచడం ద్వారా ఏ ప్రయోజనం సాధిస్తారు? నిందితుల్లో ఒకరు సీనియర్ ఆఫీసర్. ఒకవేళ వాళ్లు సాక్షులను ప్రభావితం చేస్తారని భావిస్తే, మేము కొన్ని షరతులు విధిస్తాం" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 
ఈ పిటిషన్లపై పది రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈలోగా పిటిషనర్లకు లొంగుబాటు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. అయితే, ట్రయల్ కోర్టు విధించిన షరతులు యథాతథంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును తాము తప్పుపట్టడం లేదని, కేవలం మధ్యంతర రక్షణ మాత్రమే కల్పిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
K Dhanunjaya Reddy
AP Liquor Scam
Krishna Mohan Reddy
Balaji Govindappa
Supreme Court
Default Bail
AP High Court
Liquor Case

More Telugu News