Chandrababu: అమరావతి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu prioritizes Amaravati farmers issues
  • అమరావతి రైతుల సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశం
  • రైతులతో త్వరలో సమావేశం కావాలని మంత్రి నారాయణకు సూచన
  • పరిష్కారం కాని అంశాలను కేబినెట్ ముందుకు తేవాలని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు
  • అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం
రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు అండగా నిలవాలని, వారికి పూర్తి న్యాయం జరగాలని స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో సీఆర్డీఏ కార్యకలాపాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. "గత ఐదేళ్లలో రాజధాని రైతులు సుదీర్ఘ పోరాటం చేశారు. వారికి ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలి" అని పురపాలక, సీఆర్డీఏ శాఖలను ఆదేశించారు. రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు త్వరలోనే వారితో సమావేశం కావాలని పురపాలక శాఖ మంత్రి నారాయణకు, ఉన్నతాధికారులకు సూచించారు. ప్రభుత్వం కోసం త్యాగాలు చేసిన రైతులకు అదే స్థాయిలో సహకారం అందించడం మన బాధ్యత అని అన్నారు. ఇంకా ఏమైనా అపరిష్కృత అంశాలు మిగిలి ఉంటే, వాటిని కేబినెట్ సమావేశం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

అలాగే, అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలను వేగంగా పూర్తిచేసేందుకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. నిర్మాణాల వేగం, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అంతిమంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పి. నారాయణతో పాటు సీఆర్డీఏ, పురపాలక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu
Amaravati farmers
AP CRDA
Andhra Pradesh capital
Land pooling scheme
Farmer welfare
P Narayana
Capital region development authority
Amaravati construction

More Telugu News