Chandrababu Naidu: రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే కనిపించాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Focuses on Pothole Free Roads in Andhra Pradesh
  • గుంతల్లేని రహదారులే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అన్న సీఎం చంద్రబాబు
  • ఏపీ-లింక్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలని అధికారులకు ఆదేశం
  • రోడ్ల నిర్మాణంలో నాణ్యత, ఇంజనీర్లకు జవాబుదారీతనం తప్పనిసరి
  • పనుల పర్యవేక్షణకు డ్రోన్లు, శాటిలైట్ టెక్నాలజీ వినియోగించాలని సూచన
రాష్ట్రంలోని రహదారులను గుంతలు లేకుండా (పాత్ హోల్ ఫ్రీ) తీర్చిదిద్దడమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతాంశమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో, ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ-లింక్) ను ఆర్థికంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రహదారులు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "ఏపీ-లింక్ సంస్థ ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. దానిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఆర్ అండ్ బీ శాఖకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని ఏ మేరకు వినియోగించుకోవచ్చో పరిశీలించాలి. లాజిస్టిక్స్ రంగంలోకి భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తే సంస్థ బలపడుతుంది. తద్వారా రాష్ట్రంలో రహదారుల నెట్‌వర్క్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు" అని దిశానిర్దేశం చేశారు.

నిర్మాణంలో నాణ్యత, జవాబుదారీతనం ముఖ్యం
రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని సీఎం స్పష్టం చేశారు. "నాణ్యతలో రాజీపడే కాంట్రాక్టర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, పర్యవేక్షణ చేసే ఇంజనీర్లు కూడా పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలి. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే కనిపించాలి" అని ఆయన అన్నారు. ఈ ఏడాది మార్చిలో ఆమోదించిన పనులు కేవలం 10-15 శాతం మాత్రమే పూర్తి కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, ఇటీవల ఆమోదం పొందిన పనులను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని, పెండింగ్‌లోని పనులన్నీ వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

పర్యవేక్షణకు ఆధునిక టెక్నాలజీ
రహదారుల పరిస్థితిని, నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. "అవసరమైతే డ్రోన్లు, లైడార్ సర్వే, శాటిలైట్ సర్వేల ద్వారా రోడ్ల పరిస్థితిని, పనుల నాణ్యతను పరిశీలించాలి" అని తెలిపారు. మొంథా తుఫాను వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేయాలని, పీపీపీ విధానంలో చేపట్టే రోడ్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణంపై పైలట్ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు.

రాష్ట్ర రహదారులతో పాటు జాతీయ రహదారుల పనుల్లోనూ జాప్యం జరగకుండా చూడాలని, భూసేకరణ వంటి అంశాల్లో కేంద్రానికి పూర్తి సహకారం అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. "ప్రజాప్రతినిధులంతా 'స్టేట్ ఫస్ట్-డెవలప్‌మెంట్ ఫస్ట్' అనే విషయాన్ని గుర్తించి పనిచేయాలి" అని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ అండ్ బీ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh roads
AP-Link
Road Development
Infrastructure Corporation
Pothole Free Roads
Road Construction
Highway Projects
Logistics Infrastructure
Modern Technology

More Telugu News