'డ్యూడ్' పాటల వివాదం... ఇప్పుడెందుకు వచ్చారని ఇళయరాజాను ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
- డ్యూడ్' సినిమాలో తన పాటలు వాడారని ఇళయరాజా కేసు
- సినిమా విడుదలై హిట్టయ్యాకకేసు వేయడంపై హైకోర్టు ప్రశ్న
- సోనీ నుంచి హక్కులు తీసుకున్నామన్న మైత్రీ మూవీ మేకర్స్
- ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, విచారణ వాయిదా
విచారణ సందర్భంగా ఇళయరాజా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి మైత్రీ మూవీ మేకర్స్ తమ క్లయింట్ పాటలను సినిమాలో ఉపయోగించుకుందని ఆరోపించారు. పాటల హక్కులు ఇళయరాజాకే ఉన్నాయని, వెంటనే సినిమా నుంచి వాటిని తొలగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన మైత్రీ మూవీ మేకర్స్ తరఫు న్యాయవాది.. తాము పాటల హక్కులను 'సోనీ' సంస్థ నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, సోనీ వాటిని 'ఎకో' సంస్థ నుంచి పొందిందని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని, సినిమా విడుదలయ్యే వరకు మౌనంగా ఉండి ఇప్పుడెందుకు వచ్చారని ఇళయరాజా తరఫు న్యాయవాదిని నిలదీశారు. 30 ఏళ్ల నాటి పాటలకు ఇప్పటికీ ఆదరణ లభిస్తోందని, దీనివల్ల ఇళయరాజాకు ఎలాంటి నష్టం జరిగిందని ప్రశ్నించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తదుపరి విచారణ తేదీని ప్రకటించకుండా కేసును వాయిదా వేసింది. ఈ కేసుతో పాత పాటల కాపీరైట్ల అంశం మరోసారి తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.