Smriti Mandhana: స్మృతి మంధనతో వివాహం వాయిదా.. పలాశ్ ముచ్చల్ కు కజిన్ సిస్టర్ మద్దతు

Smriti Mandhana Wedding Called Off Palash Muchhal Cousin Supports Him
  • టీమిండియా క్రికెటర్ స్మృతి మంధన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్ఛల్ వివాహం వాయిదా
  • స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధన గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిక
  • పలాశ్ పై సోషల్ మీడియాలో విమర్శలు, అండగా నిలిచిన కుటుంబ సభ్యులు
  • తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి ఎంగేజ్‌మెంట్ రీల్‌ను తొలగించిన స్మృతి మంధన
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధన, బాలీవుడ్ యువ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్ఛల్‌ల వివాహం అనూహ్యంగా వాయిదా పడింది. నవంబర్ 23న అంగరంగ వైభవంగా జరగాల్సిన వీరి పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధన అస్వస్థతకు గురికావడమే ఇందుకు కారణం. ఈ క్లిష్ట సమయంలో పలాశ్ పై సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తగా, ఆయన కుటుంబ సభ్యులు గట్టిగా స్పందించి, వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వివాహ వేడుకకు కొద్ది గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధనకు గుండెపోటు లక్షణాలు కనిపించడంతో, కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన సాంగ్లీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో వివాహం నిలిచిపోయింది. అంతకుముందు జరిగిన ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో స్మృతి, పలాశ్ ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. ఈ ఫొటోలను, వీడియోలను పలాశ్ కజిన్ సిస్టర్ నీతి తక్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అయితే, పెళ్లి ఆగిపోయిందన్న వార్త తెలియగానే సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. పలాశ్ మోసం చేశాడంటూ కొందరు ఆరోపణలు గుప్పించారు. ఈ ప్రచారంపై పలాశ్ కు వరుసకు సోదరి అయ్యే నీతి తక్ తీవ్రంగా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్ పెడుతూ, "పలాశ్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. వాస్తవాలు తెలియకుండా అతడిపై తప్పుడు ప్రచారం చేయకండి. దయచేసి అతడిని విమర్శించడం ఆపి, తన కోసం ప్రార్థించండి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ స్మృతి మంధన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ఎంగేజ్‌మెంట్ రీల్‌ను తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఆమె తన సహచర క్రీడాకారిణులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, చివర్లో తన నిశ్చితార్థపు ఉంగరాన్ని ప్రదర్శించారు. ఈ రీల్ కనిపించకపోవడంతో అభిమానుల్లో అనుమానాలు మరింత బలపడ్డాయి.

మరోవైపు, కాబోయే మామగారికి అనారోగ్యం చేసిందన్న వార్తతో పలాశ్ ముచ్ఛల్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అతడి ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఈ విషయంపై పలాశ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ, "ఈ ఘటనతో పలాశ్ తీవ్రంగా ఏడ్చాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం. వైద్యులు నాలుగు గంటల పాటు ఐవీ డ్రిప్ ఎక్కించి, ఈసీజీతో పాటు ఇతర పరీక్షలు చేశారు. నివేదికలు సాధారణంగానే ఉన్నా, అతను తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు" అని వివరించారు.
Smriti Mandhana
Palash Muchhal
Smriti Mandhana wedding
Indian women cricket
Bollywood music director
Srinivas Mandhana health
Neeti Thak
Wedding postponed
Engagement reel deleted
Cricket news

More Telugu News