Justice Surya Kant: నేను వాకింగ్‌కు వెళ్లి ఇబ్బందిపడ్డాను: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Justice Surya Kant Concerned About Delhi Air Pollution After Personal Experience
  • మంగళవారం గంటసేపు వాకింగ్‌కు వెళ్లినట్లు చెప్పిన సీజేఐ
  • శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యాయని వెల్లడి
  • వర్చువల్ మోడ్ విచారణకు అనుమతించాలని సీనియర్ న్యాయవాది విజ్ఞప్తి 
  • బార్ అసోసియేషన్ అంగీకరిస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్న సీజేఐ
దేశ రాజధాని ఢిల్లీలోని వాయు కాలుష్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ కాలుష్యం వల్ల తాను కూడా ఇబ్బందిపడ్డానని తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఇటీవల నిత్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న విషయం తెలిసిందే.

మంగళవారం ఉదయం తాను గంటసేపు వాకింగ్‌కు వెళ్లానని, ఆ సమయంలో తనకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు విచారణలను వర్చువల్ మోడ్‌కు మార్చడానికి బార్ అసోసియేషన్ అంగీకరిస్తే కోర్టు ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఇటీవల వాయు నాణ్యత సూచీలు దారుణంగా పడిపోయాయని, కాలుష్య తీవ్రత వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో 60 ఏళ్లకు పైబడిన న్యాయవాదులు వ్యక్తిగతంగా కోర్టుకు రావడానికి బదులుగా వర్చువల్ విధానంలో విచారణకు హాజరు కావడానికి అనుమతించాలని సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది విజ్ఞప్తి చేశారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ వ్యాఖ్యలతో ఏకీభవించారు.

అరవై ఏళ్ల వయస్సులో తాము వాయు కాలుష్యంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. దీంతో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, తాను కూడా ఇబ్బందిపడుతున్నానని అన్నారు.

జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం రెండు వారాల క్రితమే ఢిల్లీ కాలుష్యంపై న్యాయవాదులను హెచ్చరించింది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు న్యాయవాదులు స్వయంగా కోర్టుకు హాజరు కానవసరం లేదని, వర్చువల్ హియరింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తామని తెలిపింది.
Justice Surya Kant
Delhi pollution
air pollution
Supreme Court
virtual hearings
CJI Surya Kant

More Telugu News