Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా ఒక మిషన్ ఉంటుంది.. అదే 'కమీషన్': హరీశ్ రావు ఎద్దేవా

Revanth Reddy has a commission mission says Harish Rao
  • కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.50 వేల కోట్ల పవర్ స్కామ్‌కు తెరలేపిందని ఆరోపణ
  • పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో 30, 40 శాతం కమీషన్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ
  • కమీషన్లు ఎలా కొల్లగొట్టాలని మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా చేస్తే అందులో ఒక మిషన్ ఉంటుందని, అదే 'కమీషన్' అని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.50 వేల కోట్ల పవర్ స్కామ్‌కు తెరలేపిందని ఆరోపించారు. ఇందులో పవర్ ప్లాంట్ల ఏర్పాటుతో 30, 40 శాతం కమీషన్లు తీసుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.

కమీషన్లు ఎలా కొల్లగొట్టాలని మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని విమర్శించారు. వాటాల పంపిణీ విషయంలో మంత్రులు ఘర్షణ పడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రుల కుటుంబ సభ్యులే బయటకు వచ్చి వాటాల అంశంపై మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అరాచకాలకు కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని అన్నారు.

కొత్తగా పాల్వంచ, రామగుండం, మక్తల్‌లో 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రూ. 50 వేల కోట్లు అవసరమని అన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.19 వేల కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. అప్పుగా రూ. 40 వేల కోట్లు తీసుకు రావాలని, దీనిని ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.
Revanth Reddy
Harish Rao
Telangana
BRS
Congress
Power Scam
Commission
Corruption

More Telugu News