Pauline Hanson: ఆస్ట్రేలియా పార్లమెంట్ లో బురఖా వివాదం

Australian Senator Pauline Hanson Suspended for Burqa Stunt
  • దేశంలో బురఖాను నిషేధించాలని డిమాండ్ తో మహిళా సెనేటర్ వినూత్న నిరసన
  • బురఖా ధరించి పార్లమెంట్ కు హాజరైన సెనేటర్ పౌలిన్ హాన్ సన్
  • హాన్ సన్ తీరుపై మండిపడ్డ స్పీకర్.. ఫిబ్రవరి వరకు ఆమెపై సస్పెన్షన్ వేటు
ఆస్ట్రేలియా పార్లమెంట్ లో బురఖాపై వివాదం నెలకొంది. దేశంలో బురఖాను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళా సెనేటర్ బురఖా ధరించి పార్లమెంట్ కు హాజరుకావడంపై తోటి సభ్యులు అభ్యంతరం తెలిపారు. బురఖాను నిషేధించాలన్న ఆమె ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్.. సదరు సెనేటర్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు.

అసలు ఏం జరిగిందంటే..
ఆస్ట్రేలియాలో బురఖాను, ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ సెనేటర్ పౌలిన్ హాన్ సన్ (71) పార్లమెంట్ లో ఓ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై చర్చకు కూడా తోటి సెనేటర్లు అంగీకరించకపోవడంపై మండిపడ్డ హాన్ సన్.. దీనికి నిరసనగా తల నుంచి పాదం వరకు కప్పి ఉంచే బురఖా ధరించి పార్లమెంట్ కు వచ్చారు.

అయితే, బురఖాలో సమావేశాలకు హాజరుకావడం పార్లమెంట్ తో పాటు తోటి సెనేటర్లను అవమానించడమేనని, హాన్ సన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని మిగతా సెనేటర్లు విమర్శించారు. హాన్ సన్ తీరుపై స్పీకర్ కూడా మండిపడ్డారు. వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. దీనికి హాన్ సన్ ససేమిరా అనడంతో స్పీకర్ ఆమెను ఫిబ్రవరి వరకూ సస్పెండ్ చేశారు.
Pauline Hanson
Australia Parliament
Burqa Ban
Australian Politics
Senator Pauline Hanson
Burqa Controversy
Muslim Veil
Parliament Suspension
Freedom of Expression

More Telugu News