Sankranti Festival: పండగ ప్రయాణం భారం.. హైదరాబాద్-విశాఖ బస్సు టికెట్ రూ.7000

Hyderabad to Visakhapatnam Bus Ticket Price Soars for Sankranti
  • సంక్రాంతికి చుక్కలనంటుతున్న ప్రైవేట్ బస్ చార్జీలు
  • విమాన టికెట్లను మించిపోయిన బస్సుల ధరలు
  • ఆర్టీసీ, రైళ్లలో టికెట్లు ఫుల్.. ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీ
  • పండక్కి ఊరెళ్లాలంటే ప్రయాణికుల జేబుకు చిల్లు
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో టికెట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు ఇదే అదునుగా ఛార్జీలను భారీగా పెంచేశారు. కొన్ని మార్గాల్లో విమాన టికెట్ ధరలను మించి బస్సు చార్జీలు ఉండటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది.

సంక్రాంతి పండగ జనవరి 13, 14 తేదీల్లో రానుండగా దానికి ముందు వారాంతం కలిసి రావడంతో జనవరి 9, 10 తేదీల్లో ప్రయాణాలకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. ఈ అవకాశాన్ని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం వెళ్లే బస్సుల టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి.

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో టికెట్ ధర సుమారు రూ.1,880 ఉండగా, ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో ఇదే ధర రూ.5,000 నుంచి రూ.6,999 వరకు పలుకుతోంది. ఆశ్చర్యకరంగా ఇదే మార్గంలో జనవరి 9న విమాన టికెట్ ధర సుమారు రూ.6,500 మాత్రమే ఉండటం గమనార్హం. అంటే బస్సు ప్రయాణం విమానం కంటే ఖరీదుగా మారింది.

ఈ లెక్కన ఐదుగురు సభ్యులున్న ఒక కుటుంబం ప్రైవేట్ బస్సులో విశాఖపట్నం వెళ్లాలంటే కేవలం టికెట్లకే రూ.30,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. పండగ రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక బస్సులు, రైళ్లను ప్రకటించకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ ఆపరేటర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Sankranti Festival
Sankranti
Hyderabad
Visakhapatnam
bus tickets
private travels
APSRTC
flight tickets
travel costs
holiday travel

More Telugu News