Telangana High Court: తెలంగాణకు కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది: మద్యం షాపులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Telangana may need a new name High Court remarks
  • విచ్చలవిడిగా మద్యం దుకాణాల ఏర్పాటుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
  • ఇలాగే పెంచితే తెలంగాణకు కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్య
  • నివాసాల మధ్య మద్యం షాపుపై స్థానికులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. మద్యం దుకాణాల నియంత్రణపై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ, ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు తాము ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కనీసం రహదారిపైకి మద్యం దుకాణాలు కనిపించకుండా ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది.

ఈ వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని నాగారం మున్సిపల్, ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు సదరు మద్యం దుకాణం యజమానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. 
Telangana High Court
Telangana liquor shops
Telangana alcohol sales
High Court comments
Liquor shop rules
Nagaramm Municipality
Excise Department Telangana
Justice Vijay Sen Reddy
Telangana news

More Telugu News