Gold Loans: గోల్డ్ లోన్ మార్కెట్ జోరు.. రూ.14.5 లక్షల కోట్లకు చేరిన రుణాలు

Gold Loan NBFCs See Record Growth in India
  • గతేడాదితో పోలిస్తే 36 శాతం వృద్ధి నమోదు
  • బంగారం ధరలు పెరగడంతో పసిడి రుణాలకు పెరిగిన గిరాకీ
  • దేశవ్యాప్తంగా 3,000 కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు సిద్ధమవుతున్న కంపెనీలు
దేశంలో గోల్డ్ లోన్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. బంగారం ధరలు పెరగడం, ఇతర హామీలేని రుణాలపై సంస్థలు విముఖత చూపడంతో ప్రజలు పసిడి రుణాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబరు నాటికి దేశంలోని గోల్డ్ లోన్ ఎన్‌బీఎఫ్‌సీలు (NBFC) ఇచ్చిన రుణాల విలువ రికార్డు స్థాయిలో రూ.14.5 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది ఏకంగా 36 శాతం అధికం. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ మార్కెట్ విలువ రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (ICRA) అంచనా వేసింది.

పెరిగిన డిమాండ్‌కు కారణాలివే
ఈ సంవత్సరం పసిడి ధర సుమారు 60 శాతం పెరిగింది. మరోవైపు, సూక్ష్మ రుణ సంస్థలు హామీ లేని రుణాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు తమ ఆర్థిక అవసరాల కోసం బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు బంగారం విలువలో 70 నుంచి 80 శాతం వరకు రుణం అందిస్తుండటం కూడా ఆకర్షణగా మారింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ లోన్ మార్కెట్ 30 నుంచి 35 శాతం వృద్ధి సాధిస్తుందని ఇక్రా అంచనా వేస్తోంది.

కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు కసరత్తు
పసిడి రుణాలకు పెరుగుతున్న గిరాకీని అందిపుచ్చుకునేందుకు గోల్డ్ లోన్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలు భారీ విస్తరణ ప్రణాళికలు రచిస్తున్నాయి. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 3,000 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో 1,800 బ్రాంచ్‌లను ముత్తూట్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వంటి అగ్రశ్రేణి సంస్థలే ప్రారంభించనున్నాయి. ఎల్&టీ ఫైనాన్స్, పూనావాలా ఫిన్‌కార్ప్ వంటి సంస్థలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తుండగా, త్వరలో జియో ఫైనాన్స్ కూడా అడుగుపెట్టవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం మీద బంగారం ధరల పెరుగుదల, గోల్డ్ లోన్ కంపెనీల వ్యాపార విస్తరణకు అండగా నిలుస్తోంది.
Gold Loans
Gold price
NBFC
Muthoot Finance
Bajaj Finance
IIFL Finance
Loan Market
ICRA
Gold Loan Market Growth
Indian Economy

More Telugu News