Raja Singh: అయ్యప్పమాల ధరించిన ఎస్సైకి మెమో... మండిపడిన రాజాసింగ్

Raja Singh Slams Memo to SI for Ayyappa Mala Deeksha
  • అయ్యప్ప దీక్ష సమయంలోనే ఇలాంటి నిబంధనలు గుర్తుకు వస్తాయా అని ప్రశ్న
  • ముస్లిం పోలీసులకు ఇచ్చిన స్వేచ్ఛ హిందూ పోలీసులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్న
  • నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలన్న రాజాసింగ్
అయ్యప్ప మాల ధరించిన ఎస్సైకి మెమో జారీ చేయడంపై గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. పోలీసు శాఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప దీక్ష సమయంలోనే పోలీసులకు నియమ నిబంధనలు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం పోలీసులకు ఇచ్చిన స్వేచ్ఛ హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.

అయ్యప్ప మాల ధరించిన కంచన్‌బాగ్ ఎస్సై కృష్ణకాంత్‌కు మెమో జారీ అయింది. మాల వేయడం, గడ్డం పెంచడం, పోలీసు బూట్లు లేకుండా విధులకు హాజరవడంపై వివరణ ఇవ్వాలని సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో పోలీసులకు కీలక సూచనలు చేశారు.

మాల వేసుకోవాలనుకుంటే అనుమతి తీసుకోవాలని, రెండు నెలల పాటు సెలవులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మెమోపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల జారీ చేసిన ఆదేశాలు కేవలం హిందువులకే వర్తిస్తాయా? ముస్లింలకు కూడా వర్తిస్తాయా? అని ఆయన నిలదీశారు. రంజాన్ సమయంలో లేని నిబంధనలు, అయ్యప్ప మాలధారణ సమయంలోనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. హిందువుల పండుగలు వచ్చినప్పుడు, హిందువులు మాలలు ధరించినప్పుడు ఇలాంటి ఆదేశాలు ఎందుకు వస్తున్నాయని ఆయన అడిగారు.

నిబంధనలు ఉంటే అందరికీ ఒకేలా ఉండాలని, కానీ ఒక్కో మతానికి ఒక్కోలా ఉండకూడదని అన్నారు. హిందువులకు నిబంధనలు ఎలా ఉంటే, ముస్లింలకు కూడా అలాగే ఉండాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ అని ముఖ్యమంత్రి చెప్పారని, దానిని ఈ నిబంధనల ద్వారా నిరూపిస్తున్నారని ఆయన అన్నారు.
Raja Singh
Ayyappa Deeksha
Kanchabagh SI Krishna Kanth
Hyderabad Police

More Telugu News