Nooruddin Azizi: భారత్‌లో తాలిబన్ మంత్రి.. ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ దాడులు.. పది మంది మృతి

Afghanistan Pakistan Tensions Rise After Pakistan Airstrikes
  • మళ్లీ భగ్గుమన్న ఆఫ్ఘన్-పాక్ సరిహద్దు
  • మృతుల్లో 9 మంది చిన్నారులు 
  • ఇరు దేశాల మధ్య మరోసారి పెరిగిన ఉద్రిక్తతలు
ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. నిన్న అర్ధరాత్రి ఆఫ్ఘన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ డ్రోన్ దాడుల్లో నివాస గృహాలు ధ్వంసం కాగా, 9 మంది చిన్నారులు సహా మొత్తం 10 మంది మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. పలు ఇతర ప్రావిన్స్‌లపైనా ఈ దాడుల ప్రభావం ఉందని పేర్కొంది.

ఆఫ్ఘనిస్థాన్ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజ్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉండగా ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం ఇస్తోందని పాక్ ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తోంది.

గతంలోనూ ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో పాకిస్థాన్ ఇలాంటి దాడులకే పాల్పడింది. అప్పుడు టీటీపీ చీఫ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాక్ ప్రకటించింది. కీలకమైన సందర్భాల్లో పాక్ ఇలా దాడులకు దిగడం ఇరు దేశాల మధ్య వైరాన్ని మరింత పెంచుతోంది.

ఇటీవల ఖతార్, తుర్కియేల మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, తాజా దాడులతో ఆ ఒప్పందం నీరుగారిపోయింది. ఈ ఘటనతో సరిహద్దుల్లో మళ్లీ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
Nooruddin Azizi
Afghanistan
Pakistan
Taliban
airstrikes
Khost province
TTP
India
Peshawar attack
border tensions

More Telugu News