Walking: రోజూ పదివేల అడుగులు నడిస్తేనే ఆరోగ్యమా.. నిపుణులు ఏమంటున్నారంటే!

Walking 10000 steps not mandatory for health says experts
  • తక్కువ దూరం నడిచినా పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వెల్లడి
  • పదివేల అడుగులు నడవడం తప్పనిసరి అనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని వివరణ
  • అంత సమయం లేదని నడక మానేయొద్దని సూచన
రోజూ పదివేల అడుగులు నడవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అయితే, పదివేల అడుగులు నడవడం తప్పనిసరేం కాదని తాజా పరిశోధనలో తేలింది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయనంలో నడక ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అయితే కచ్చితంగా పదివేల అడుగులు నడవాలనే నియమం ఏదీ లేదని వెల్లడైంది. అంతకన్నా తక్కువ దూరం నడిచినా సరే ప్రయోజనాలు ఉన్నాయని, అయితే, ప్రతిరోజూ నడవడమే ముఖ్యమని పేర్కొంది.

కేవలం 10 నిమిషాల నడక కూడా మూడ్‌ను మెరుగుపరుస్తుంది. రోజూ పదివేల అడుగులు నడిచేందుకు సమయం లేదని వాకింగ్ మానేయొద్దని సూచించింది. నిజానికి 10 వేల అడుగుల నడవాలనే ప్రచారం 1960లలో జపాన్‌ లో ఒక మార్కెటింగ్ సంస్థ చేపట్టిన ప్రచారమేనని, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేవలం మొత్తం అడుగుల సంఖ్య మాత్రమే కాదు, స్థిరత్వం మరియు ఎక్కువసేపు కూర్చోకుండా ఉండటం ముఖ్యమని తెలిపింది.

4 వేల అడుగులు నడకతో..
రోజుకు కేవలం 4,000 అడుగులు నడిచినా కూడా త్వరగా మరణించే ప్రమాదం తగ్గుతుంది. వారంలో ఒకటి, రెండు రోజులు ఇలా నడిచినా సరే అస్సలు నడవని వారితో పోలిస్తే ఆకస్మికంగా మరణించే ముప్పు 26 శాతం, గుండె జబ్బుల ముప్పు 27 శాతం తగ్గుతుందని తేలింది. వారంలో మూడు రోజులకు పైగా 4 వేల అడుగులు నడిస్తే ఆకస్మిక మరణ ముప్పు ఏకంగా 47 శాతానికి తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. 2 లక్షల మందికి పైగా వ్యక్తులపై చేసిన మెటా-విశ్లేషణలో, రోజుకు 3,867 అడుగులు నడవడం వల్ల ఏ కారణం చేతనైనా మరణించే ప్రమాదం తగ్గుతుందని తేలింది. రోజుకు 2,337 అడుగులు నడిస్తే గుండె మరియు రక్తనాళాల వ్యాధుల వల్ల చనిపోయే ప్రమాదం తగ్గుతుందని వెల్లడైంది.

వృద్ధుల్లో..
వృద్ధులు రోజుకు 6 వేల నుంచి 9 వేల అడుగులు నడవడం వల్ల గుండె జబ్బుల ముప్పును 40% నుంచి 50% వరకు తగ్గించుకోవచ్చు. రోజుకు 3,800 అడుగులు నడవడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం 25% తగ్గుతుంది. క్రమం తప్పని వాకింగ్ వల్ల మెదడులో ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తాయి.

భోజనం తర్వాత..
భోజనం చేసిన తర్వాత 15 నిమిషాల చిన్న నడకలు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి 30 నిమిషాలు నడిచే సమయం లేనపుడు రోజులో మూడుసార్లు 10 నిమిషాల చొప్పున నడిచినా అవే ప్రయోజనాలు పొందవచ్చన్నారు. రోజు మొత్తంలో పలుమార్లు నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావం తగ్గుతుందని తాజా పరిశోధన తేల్చింది.
Walking
Daily walking
Health benefits
Exercise
Fitness
Heart health
Step count
British Journal of Sports Medicine
Physical activity
Mortality risk

More Telugu News