Instamart: ఏఐ మాయాజాలం.. ఒక్క కోడిగుడ్డు పగిలితే 20 అని నమ్మించి రిఫండ్!

AI Used to Fake Cracked Eggs on Instamart Refund
  • నకిలీ ఫొటోను నమ్మి పూర్తి రిఫండ్ ఇచ్చిన ఇన్‌స్టామార్ట్
  • ట్రస్ట్ ఆధారిత రిఫండ్ సిస్టమ్‌లకు ఏఐ పెను సవాల్
  • ధ్రువీకరణ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాల్సిన ఆవశ్యకతపై చర్చ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో, ఈ టెక్నాలజీతో కొత్త రకం మోసాలు కూడా తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టామార్ట్‌లో ఓ వినియోగదారుడు ఏఐ సాయంతో నకిలీ ఫొటో సృష్టించి, కంపెనీ నుంచి పూర్తి రిఫండ్ పొందడం సంచలనంగా మారింది. ఈ ఘటన ఈ-కామర్స్ కంపెనీల రిఫండ్ వ్యవస్థలలోని లోపాలను బయటపెట్టింది.

ఓ వ్యక్తి ఇన్‌స్టామార్ట్‌లో కోడిగుడ్లు ఆర్డర్ చేయగా వాటిలో ఒకటి మాత్రమే పగిలినది వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేసే క్రమంలో అతను వినూత్నంగా ఆలోచించాడు. గూగుల్‌కు చెందిన 'నానో బనానా ప్రో' అనే ఇమేజింగ్ టూల్‌ను ఉపయోగించి, ఆ ఫొటోలో 'మరిన్ని పగుళ్లు సృష్టించు' (apply more cracks) అని కమాండ్ ఇచ్చాడు. క్షణాల్లోనే ఆ టూల్, ఒకే గుడ్డు పగిలిన ఫొటోను 20కి పైగా గుడ్లు పగిలిపోయినట్లుగా అత్యంత సహజంగా మార్చేసింది. ఈ ఫొటోను చూసిన ఇన్‌స్టామార్ట్ సపోర్ట్ టీమ్ అది నిజమని నమ్మి వెంటనే పూర్తి రిఫండ్ జారీ చేసింది.

ఈ ఘటనను ఎక్స్ వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారింది. "ఫొటోలను నమ్మదగినవిగా భావించే ప్రపంచం కోసం మన రిఫండ్ సిస్టమ్‌లు నిర్మించబడ్డాయి. కానీ ఇప్పుడు అవి 2025 స్థాయి ఏఐ టెక్నాలజీ ముందు నిలవలేకపోతున్నాయి. ఇలాంటి మోసాలు కేవలం ఒక శాతం మంది చేసినా, క్విక్-కామర్స్ కంపెనీల వ్యాపారాలు కుప్పకూలిపోతాయి. ఇక్కడ సమస్య ఏఐ కాదు, పాతకాలపు ధ్రువీకరణ వ్యవస్థలే అసలు సమస్య" అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏఐ రూపొందించిన చిత్రాలకు కనిపించని వాటర్‌మార్క్‌లు (SynthID వంటివి) జోడించాలని, తద్వారా వాటిని సులువుగా గుర్తించవచ్చని కొందరు సూచిస్తున్నారు. డెలివరీ సమయంలో 'ఓపెన్ బాక్స్ డెలివరీ'ని గోప్రో కెమెరాలతో రికార్డ్ చేయాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. "సాక్ష్యాలను మార్చగలిగినప్పుడు, నమ్మకమే బలహీనతగా మారుతుంది" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మొత్తంమీద, ఈ ఘటన ఏఐ ఆధారిత మోసాలను ఎదుర్కోవడానికి కంపెనీలు తమ ధ్రువీకరణ వ్యవస్థలను తక్షణమే అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తోంది.
Instamart
AI fraud
artificial intelligence
refund system
e-commerce
image manipulation
NANO Banana Pro
cracked eggs
online shopping
verification system

More Telugu News