Ravi Kiran Yedidi: వ్యాక్సిన్లను బోల్తా కొట్టించిన కరోనా.. ఏయూ పరిశోధనలో సంచలన నిజాలు!

Coronavirus Mutation Bypassed Vaccines Andhra University Research
  • వైరస్ జన్యువుల మార్పులే ప్రధాన కారణమని వెల్లడి
  • యాంటీబాడీల నుంచి తప్పించుకున్న కరోనా స్పైక్ ప్రొటీన్
  • ఏయూ విద్యార్థుల అధ్యయనానికి అంతర్జాతీయ గుర్తింపు
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో ఎందుకు ప్రభావం చూపలేకపోయాయో ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) పరిశోధకులు నిర్ధారించారు. కరోనా వైరస్ తన స్పైక్ ప్రొటీన్ (జన్యువు) రూపాన్ని మార్చుకుంటూ, వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తయిన యాంటీబాడీలను అయోమయానికి గురిచేసిందని వారి అధ్యయనంలో వెల్లడైంది. ఈ కీలక పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం.

ఏయూకు చెందిన టీ క్యాబ్స్-ఇ ల్యాబ్ వ్యవస్థాపకులు డాక్టర్ రవికిరణ్ యేడిది నేతృత్వంలో విద్యార్థుల బృందం 2021 నుంచి 2023 వరకు సుమారు రెండేళ్ల పాటు ఈ పరిశోధన సాగించింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెంది వైరస్‌పై దాడి చేస్తాయి. అయితే, కరోనా వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్ తన భౌతిక రూపాన్ని మార్చుకోవడం ద్వారా ఈ యాంటీబాడీల నుంచి తప్పించుకున్నట్లు గుర్తించారు. పరిశోధన కోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్పైక్ ప్రొటీన్‌పై ప్రయోగాలు చేయగా, అది కొన్నిసార్లు ఘనరూపంలోకి, మరికొన్నిసార్లు ద్రవరూపంలోకి మారుతున్నట్లు కనుగొన్నారు.

యాంటీబాడీలు కేవలం ఘనరూపంలో ఉన్న వైరస్‌ను మాత్రమే గుర్తించి దాడి చేయగలిగాయని, అదే వైరస్ ద్రవరూపంలోకి మారినప్పుడు దానిని గుర్తించలేకపోయాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. దీనివల్లే వ్యాక్సిన్ తీసుకున్న చాలామందికి కూడా వైరస్ సోకిందని నిర్ధారించారు. ఈ పరిశోధన వివరాలు ప్రతిష్ఠాత్మక 'ఎల్సేవియర్' అంతర్జాతీయ సైన్స్ పత్రిక 'బీబీఏ'లో ప్రచురితమయ్యాయి. 
Ravi Kiran Yedidi
Coronavirus
COVID-19
Vaccines
Andhra University
Spike Protein
Antibodies
Virus Mutation
T Cabs-i Lab
Elsevier BBA

More Telugu News