Tummala Nageswara Rao: ఎన్టీఆర్ ప్రభావం వల్లే నాపై మరక పడలేదు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Tummala Nageswara Rao Credits NTR for His Clean Political Image
  • ప్రస్తుత రాజకీయాలు కలుషితమయ్యాయన్న మంత్రి తుమ్మల
  • తన రాజకీయ జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం ఎంతో ఉందని వెల్లడి
  • ఎన్టీఆర్ శిష్యుడినని చెప్పుకోవడం గర్వంగా ఉందని వ్యాఖ్య
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కలుషితమైపోయాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో తనపై ఎలాంటి మరక పడకుండా ఉన్నానంటే, దానికి స్ఫూర్తి దివంగత నేత ఎన్టీ రామారావేనని స్పష్టం చేశారు. ఈరోజు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

తన రాజకీయ జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉందని తుమ్మల అన్నారు. 1983 నుంచి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని తెలిపారు. "ఎన్టీఆర్ శిష్యుడు ఎవరు అంటే తుమ్మల" అనేలా పేరు తెచ్చుకున్నానని భావోద్వేగానికి గురయ్యారు. రాముడి పాదాల చెంత ఎన్టీఆరే స్వయంగా తనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఆయన నుంచే నిజాయతీ, నిబద్ధతతో రాజకీయాలు చేయడం నేర్చుకున్నానని వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు మంత్రి తుమ్మల తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని త్వరలోనే జమ చేయనున్నట్లు ప్రకటించారు. రెండు విడతల్లో, ప్రతీ సీజన్‌కు రూ.6,000 చొప్పున ఈ సాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Tummala Nageswara Rao
NTR
N T Rama Rao
Telangana Politics
Khammam
Agriculture Minister
Rythu Bharosa
Political Values
Telugu Desam Party
Political Inspiration

More Telugu News