Chandrababu Naidu: కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్... సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Chandrababu Naidu Announces Smart Family Card for Andhra Pradesh
  • రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ జారీకి నిర్ణయం
  • ఒకే కార్డుతో ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ
  • రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్ ద్వారా వివరాల సేకరణ
  • ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • వచ్చే ఏడాది జూన్‌ నాటికి 1.4 కోట్ల కార్డుల జారీ లక్ష్యం
రాష్ట్రంలో సుపరిపాలన అందించే దిశగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పౌర సేవలను మరింత పారదర్శకంగా ప్రజలకు చేరవేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి, వారి సమగ్ర సమాచారంతో కూడిన ‘స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్’ను జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం’ (ఎఫ్‌బీఎంఎస్) అమలు ద్వారా కుటుంబ సాధికారిత సాధించాలని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం నాడు సచివాలయంలో ఎఫ్‌బీఎంఎస్‌పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పౌర సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చవచ్చని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సాంకేతిక వెన్నెముకగా రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) ఆధ్వర్యంలోని డేటా లేక్‌ను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకుని ఇతర శాఖలు కూడా వాడుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు వచ్చే ఏడాది జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ కార్డులో దాదాపు 25 రకాల వివరాలతో పాటు ‘పీ4’ లాంటి అంశాలను కూడా పొందుపరచాలని సూచించారు. కుటుంబంలోని సభ్యుల వ్యాక్సినేషన్ వివరాలు, ఆధార్, ఎఫ్‌బీఎంఎస్ ఐడీ, కుల ధృవీకరణ పత్రం, పౌష్టికాహార స్థితి, రేషన్ కార్డు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, వృద్ధులు, వితంతువులకు అందే పెన్షన్ల వరకు అన్ని వివరాలను ఈ కార్డు ద్వారా ట్రాక్ చేసేలా వ్యవస్థను రూపొందించాలని అన్నారు.

కేవలం పెన్షన్లు, రేషన్ వంటి పథకాలకు మాత్రమే ఈ వ్యవస్థను పరిమితం చేయవద్దని, పౌరులకు సంబంధించిన స్టాటిక్, డైనమిక్ డేటాను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, వారి జీవితంలోని ప్రతి దశలో ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న సవాళ్లను ఈ వ్యవస్థ ద్వారా అధిగమించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు నిరంతరం అప్‌డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆధార్ సహా అన్ని వివరాలు ఈ ఒక్క కార్డు ద్వారానే తెలిసేలా పటిష్టమైన వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. 2026 జనవరి నాటికి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి, జూన్‌ నాటికి కార్డుల పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఆర్ధిక, వైద్యారోగ్య, గ్రామవార్డు సచివాలయ, పురపాలక, ప్రణాళికా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Smart Family Card
Andhra Pradesh
Family Benefit Management System
FBMS
QR Code
Government Schemes
Real Time Governance
RTG
Pension Schemes

More Telugu News