DK Aruna: ప్రభుత్వ చేతకానితనంతో రూ.3000 కోట్లు ఆగిపోయాయి: డీకే అరుణ

DK Aruna Slams Telangana Govt Over Rs 3000 Crore Funds Loss
  • రెండేళ్లుగా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని అరుణ విమర్శ
  • కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికల హడావుడి అని ఎద్దేవా
  • ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఫైర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ప్రజలకు చేసిందేమీ లేదని, అన్ని వర్గాలను మోసం చేసిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ తీవ్రంగా విమర్శించారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆమె ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనం వల్లే కేంద్రం నుంచి రావాల్సిన రూ.3000 కోట్ల పంచాయతీ నిధులు ఆగిపోయాయని డీకే అరుణ అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, ఎన్నికలు జరిగినప్పుడే కేంద్రం నేరుగా గ్రామాలకు నిధులు పంపిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ పక్షపాతం చూపిస్తున్నారని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇళ్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ పథకంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

గత ప్రభుత్వం ఇష్టానుసారంగా మండలాలను ఏర్పాటు చేసిందని, జనాభా ప్రాతిపదికన మండలాలను పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సరైన ప్రభుత్వ వైద్య సేవలు లేకపోవడం దారుణమన్నారు. చేనేత కార్మికులకు సబ్సిడీ రుణాలు అందించాలని, మహిళల కోసం జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఈ మోసాలకు మహిళలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ సమావేశంలో బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, సత్య యాదవ్, రతంగ్, లక్ష్మీకాంత్, కొండయ్య, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
DK Aruna
Telangana
Congress Government
Palamuru MP
Central Government Funds
Panchayat Elections
Narayana Pet
Indiramma Houses
PM Awas Yojana
BJP

More Telugu News