Justice Gavai: కొత్త సీజేఐ కోసం అధికారిక కారును రాష్ట్రపతి భవన్ వద్ద వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

Justice Gavai Leaves Official Car for New CJI Suryakant
  • 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్
  • అధికారిక కారులో రాష్ట్రపతి భవన్‌కు వచ్చిన జస్టిస్ గవాయ్
  • జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టాక కారును అక్కడే వదిలిన గవాయ్
సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్ తన అధికారిక కారును నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్ వద్ద వదిలి వెళ్లినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణం స్వీకారం చేసిన విషయం విదితమే. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం జస్టిస్ గవాయ్ తాను వచ్చిన వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు.

నిబంధనల ప్రకారం, సీజేఐగా పదవీ విరమణ చేసిన తర్వాత మాజీ సీజేఐలు తమ అధికారిక నివాసాలను, సీజేఐకి కేటాయించే ఇతర సౌకర్యాలను తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే జస్టిస్ గవాయ్ తన వాహనాన్ని జస్టిస్ సూర్యకాంత్ కోసం రాష్ట్రపతి భవన్ వద్ద విడిచిపెట్టినట్లు సమాచారం. 

ఈ సంవత్సరం మే 14న 52వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ బీ.ఆర్. గవాయ్ పదవీకాలం ముగియడంతో సోమవారం నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేశారు. దీనితో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
Justice Gavai
Justice BR Gavai
Justice Suryakant
Chief Justice of India
CJI
Supreme Court

More Telugu News