Family dispute: డబ్బు గొడవ.. సోదరి, ఆమె కుమార్తెలపైకి ట్రాక్టర్ పోనిచ్చిన వ్యక్తి.. వీడియో ఇదిగో!

Suryapet Man Uses Tractor in Attack on Sister Over Money Dispute
  • అప్పు తీసుకున్న సొమ్ము తిరిగివ్వడం లేదని గొడవ
  • కొడుకుతో కలిసి బిడ్డపై దాడి చేసిన తల్లి
  • సూర్యాపేట జిల్లా బరాఖత్‌ గూడెంలో దారుణం
డబ్బు బంధం ముందు ఏ బంధమూ నిలవదనే లోకోక్తికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన. కన్న కూతురుకు అప్పు ఇచ్చిన తల్లి.. ఆ సొమ్ము తిరిగివ్వడం లేదన్న కోపంతో కొడుకుతో కలిసి దాడి చేసింది. తల్లికి మద్దతుగా వెళ్లిన కొడుకు.. పొలంలో వరి పంట కోయిస్తున్న సోదరిని, ఇద్దరు మేనకోడళ్లను ట్రాక్టర్ తో తొక్కించే ప్రయత్నం చేశాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్రామస్థుల కథనం ప్రకారం..

బరాఖత్‌ గూడెం గ్రామానికి చెందిన డి.కళావతి తన కుమార్తె జ్యోతికి కొంత అప్పుగా ఇచ్చింది. ఈ డబ్బు తిరిగిచ్చే విషయంలో తల్లీకూతుళ్ల మధ్య ఇటీవల గొడవ జరిగింది. దీంతో కూతురు డబ్బు తిరిగి ఇవ్వడం లేదని కళావతి తన కుమారుడు ఉపేందర్ రెడ్డికి చెప్పింది. ఆదివారం తల్లీకొడుకులు కలిసి పొలంలో వరి పంట కోయిస్తున్న జ్యోతి వద్దకు ట్రాక్టర్ తో వెళ్లారు.

ముందుగా హార్వెస్టర్ డ్రైవర్ పై ఉపేందర్ రెడ్డి దాడి చేశాడు. అనంతరం తన సోదరి అని కూడా చూడకుండా జ్యోతిపై దాడి చేశాడు. తల్లిని కాపాడుకోవడానికి జ్యోతి ఇద్దరు కుమార్తెలు మేనమామను అడ్డుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవను చూసి చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు. వారిని విడదీసేందుకు ప్రయత్నించినా ఎవరూ ఆగలేదు. ఈ క్రమంలోనే ఉపేందర్ రెడ్డి సోదరి జ్యోతిని, ఆమె కుమార్తెలను ట్రాక్టర్ తో తొక్కించేందుకు ప్రయత్నించడం అక్కడున్న వారిని భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనపై బాధితురాలు జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Family dispute
Debt
Tractor attack
Suryapet
Munagala
Telangana
Property dispute
Crime news
Viral video
Upender Reddy

More Telugu News