Ibomma Ravi: విచారణకు సహకరించని ఐబొమ్మ రవి.. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న నిందితుడు

Ibomma Ravi Not Cooperating with Investigation
  • ప్రశ్నలకు ‘గుర్తులేదు, మర్చిపోయా’ అంటూ సమాధానాలు
  • బెట్టింగ్ యాప్స్, ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన పోలీసులు
  • నేటితో ముగియనున్న కస్టడీ.. మరోసారి కస్టడీకి కోరే అవకాశం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవి విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదు. ఐదు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుండగా, నాలుగు రోజుల విచారణలో కీలక సమాచారం రాబట్టడంలో సైబర్ క్రైమ్ పోలీసులు విఫలమయ్యారు. ఎన్ని కోణాల్లో ప్రశ్నలు సంధించినా.. ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ అంటూ రవి ఒకేరకమైన సమాధానాలు ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఓటీటీలో విడుదల కాకముందే కొత్త సినిమాలను తన వెబ్‌సైట్‌లో ఎలా అప్‌లోడ్ చేశాడనే దానిపై పోలీసులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివరాలు వెల్లడించేందుకు రవి నిరాకరిస్తున్నాడు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తును మరో కోణంలో వేగవంతం చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా ప్రచారం చేసిన బెట్టింగ్ యాప్స్, రవి ఖాతాల ద్వారా జరిగిన కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు.

ఈ లావాదేవీల సమాచారం పూర్తిగా సాంకేతికపరమైనది కావడంతో రవికి ఖాతాలున్న 35 బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు. ఆ బ్యాంకుల నుంచి పూర్తిస్థాయి నివేదికలు అందితేనే కేసులో పురోగతి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, రవి అరెస్టయినా వివిధ వెబ్‌సైట్లలో సినిమా పైరసీ ఆగకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది.

నేటి సాయంత్రం రవి కస్టడీ ముగియనుండటంతో, అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. విచారణ కొలిక్కి రానందున, అతడిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Ibomma Ravi
Ibomma
piracy case
cyber crime
OTT movies
police investigation
betting apps
financial transactions
Chanchalguda Jail

More Telugu News