Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పాక్ మీడియా తప్పుడు ప్రచారం... కౌంటర్ ఇచ్చిన ఫ్రాన్స్

France Navy Denies Pakistan Medias Fake News on Operation Sindoor
  • భారత రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ జియో టీవీ కథనం
  • పాక్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్ నావికాదళం
  • ఇది చైనా, పాకిస్థాన్ సంయుక్త దుష్ప్రచారమని వెల్లడి
  • అధికారి పేరును కూడా తప్పుగా ప్రచురించారని ఫ్రాన్స్ స్పష్టీకరణ
భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' గురించి పాకిస్థాన్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఫ్రాన్స్ నావికాదళం (మెరైన్ నేషనల్) తీవ్రంగా ఖండించింది. ఈ ఆపరేషన్‌లో భారత వాయుసేనకు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ పాకిస్థాన్ మీడియాలో వచ్చిన వార్తలను 'ఫేక్ న్యూస్'గా కొట్టిపారేసింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.

వివరాల్లోకి వెళితే, నవంబర్ 21న పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఛానల్ జియో టీవీ ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, "జాక్వెస్ లౌనే" అనే ఫ్రెంచ్ అధికారి, మే 6-7 తేదీల్లో జరిగిన గగనతల యుద్ధంలో పాకిస్థాన్ వాయుసేన చైనా తయారీ ఆయుధాలతో భారత రఫేల్ విమానాలను కూల్చివేసిందని ధృవీకరించినట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఫ్రాన్స్ నావికాదళం పూర్తిగా తోసిపుచ్చింది. తమ అధికారి పేరు "జాక్వెస్ లౌనే" కాదని, కెప్టెన్ యవాన్ లౌనే అని స్పష్టం చేసింది. ఆయన కేవలం రఫేల్ మెరైన్ విమానాలు ఉన్న నావల్ ఎయిర్ స్టేషన్‌కు కమాండర్ మాత్రమేనని తెలిపింది.

ఇండో-పసిఫిక్ సదస్సులో కెప్టెన్ లౌనే చేసిన ప్రజెంటేషన్ పూర్తిగా సాంకేతిక అంశాలకు సంబంధించిందని, అందులో నావల్ ఎయిర్ బేస్ ఆస్తులు, రఫేల్ మిషన్ల గురించి మాత్రమే వివరించారని ఫ్రాన్స్ నావికాదళం పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ గురించి గానీ, భారత విమానాలు కూలిపోవడం గురించి గానీ, చైనా జే-10 విమానాల గురించి గానీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేసింది. తన వ్యాఖ్యల ప్రచురణకు ఆయన ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, జియో టీవీ నివేదికలో పూర్తిగా తప్పుడు సమాచారం ఉందని స్పస్టం చేసింది.

ఈ పరిణామంపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య స్పందిస్తూ, ఇది పాకిస్థాన్ నిరాశతో చేస్తున్న దుష్ప్రచారమని విమర్శించారు. మరోవైపు, ఈ ఘటన వెనుక చైనా ప్రచార యుద్ధం కూడా ఉన్నట్లు అమెరికాకు చెందిన ఓ కమిషన్ నివేదిక వెల్లడించింది. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత చైనా ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, ఏఐ-జనరేటెడ్ చిత్రాలతో రఫేల్ యుద్ధ విమానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందని, తద్వారా తమ జే-35 విమానాలకు మార్కెట్ సృష్టించుకోవాలని చూసిందని ఆ నివేదిక పేర్కొంది.

Operation Sindoor
France Navy
Pakistan Media
Rafale aircraft
Fake news
Yvan Launay
Jio TV
Amit Malviya
China J-10
Indo-Pacific

More Telugu News