Brahmanandam: ఎర్రబెల్లిని నెట్టేసి వెళ్లిపోయిన బ్రహ్మానందం... అసలు విషయం ఏమిటంటే...!

Brahmanandam Clarifies Viral Video with Errabelli Dayakar Rao
  • మోహన్ బాబు వేడుకలో ఎర్రబెల్లి, బ్రహ్మానందం ఘటన
  • బ్రహ్మానందం తోసేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • అది కేవలం చనువుతో జరిగిందేనని బ్రహ్మి వివరణ
  • వీడియో చూసి ఇద్దరం నవ్వుకున్నామని స్పష్టం చేసిన నటుడు
  • అపార్థాలు చేసుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును నెట్టేసి వెళ్తున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తీవ్ర చర్చ జరగడంతో, అసలు విషయం ఏమిటో వివరిస్తూ బ్రహ్మానందం స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన మోహన్ బాబు సినీ స్వర్ణోత్సవ వేడుకలకు బ్రహ్మానందం హాజరయ్యారు. కార్యక్రమానికి ఆలస్యం అవుతుండటంతో ఆయన హడావుడిగా లోపలికి వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుపడిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఫొటో దిగుదామని అడిగారు. అప్పుడు బ్రహ్మానందం 'అబ్బే... ఇప్పుడు కాదు' అన్నట్లుగా ఆయన్ను పక్కకు జరిపి ముందుకు సాగారు. ఈ దృశ్యం రికార్డై, బ్రహ్మానందం మాజీ మంత్రిని తోసేశారంటూ ప్రచారమైంది.

ఈ వీడియోపై స్పందిస్తూ, "దయన్న (ఎర్రబెల్లి)తో నాకు 30 ఏళ్ల చనువు ఉంది. మేం మంచి మిత్రులం. ఆ చనువుతోనే సరదాగా 'ఉండండి' అని చెప్పి లోపలికి వెళ్లాను. దాన్ని ఎవరో తోసేసినట్లుగా చిత్రీకరించి ప్రచారం చేశారు. ఆ తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఉదయం ఆ వీడియో చూసి ఇద్దరం నవ్వుకున్నాం" అని బ్రహ్మానందం వివరించారు.

ఈ ఘటనపై ఎవరూ అపార్థాలు చేసుకోవద్దని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కేవలం స్నేహపూర్వక చనువుతో జరిగిన సంఘటనకు తప్పుడు రంగు పులిమారని ఆయన పేర్కొన్నారు.
Brahmanandam
Errabelli Dayakar Rao
Mohan Babu
Tollywood
Viral Video
Social Media
Hyderabad
Movie Event
Comedy Actor
Telangana

More Telugu News